సులభంగా గృహరుణం..
మిగిలిన రుణాలతో పోలిస్తే గృహరుణం తీసుకోవడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. గృహరుణం మంజూరు సుదీర్ఘమైన ప్రక్రియే కాకుండా అనేక పత్రాలను రుణం మంజూరు చేసే ఆర్థిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎవర్ని అడిగినా... వారు రుణం పొందేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది చెపుతారు. అయితే దరఖాస్తుకు ముందుగానే కొన్ని అంశాలపై దృష్టిసారిస్తే... ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా గృహరుణం పొందడమే కాకుండా వ్యయభారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మన దేశంలో గృహ రుణాల మార్కెట్ చాలా పెద్దది.
అనేక రకాల గృహరుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ గృహరుణాలు, ఇంటిని విస్తరించడం కోసం, ఇంటి మరమ్మతుల కోసం, మార్టిగేజ్, ఉమెన్ హోమ్‌లోన్స్, నాన్ రెసిడెన్షియల్, లీజ్ రెంటల్ ఫైనాన్స్, స్టెప్ అప్ ఈఎంఐ ప్రొడక్టు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పొచ్చు. ఈ రుణాలను జీతం ఆదాయంగా ఉన్న వాళ్లు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులతో పాటు కో-ఆపరేటివ్ బాడీస్, కొంత మంది సంఘంగా ఏర్పడి తీసుకోవచ్చు. ఇంటి విలువలో 80% కంటే తక్కువ మొత్తానికే గృహరుణం లభిస్తుంది. కొత్తగా గృహరుణం తీసుకునే వారికి బ్యాం కులు అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అం దిస్తున్నాయి. బ్యాంకులు పోటీపడి అతి తక్కువ రేట్లకే గృహరుణాలను ఇస్తుండటంతో పాటు, చెల్లింపు సామ ర్థ్యం ఆధారంగా మరింత తక్కువ రేటును కూడా ఇస్తున్నాయి. దీనికి తోడు పన్ను మినహాయింపులు ఉండనే ఉన్నాయి. గృహరుణం తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.
ఎంత రుణం వస్తుంది?
రుణం ఎంత వస్తుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉం టుంది. వ్యక్తి చెల్లింపు సామర్థ్యం, వయసు, చదువు, స్థిరమైన ఆదాయమా కాదా? అతనిపై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు-అప్పు లు, పొదుపు అలవాట్లు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే గరిష్టంగా ఎంత రుణం ఇవ్వొచ్చన్న దానిపైన బ్యాం కులు ఒక నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ముందునుంచే దృష్టిపెట్టడం ద్వారా గరిష్ట మొత్తాన్ని రుణంగా పొందొచ్చు.
కాలపరిమితి ముఖ్యమే..
రుణ ఎంపికలో కాలపరిమితి చాలా ముఖ్యమైన అంశం. ఈ కాలపరిమితిపైనే చెల్లించే వడ్డీ ఆధారపడి ఉంటుంది. అధిక కాలపరిమితి ఎంచుకుంటే వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోండి. సాధారణంగా బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్లలోపు చెల్లిం చే విధంగా గృహరుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఇస్తున్నాయి. రుణ కాలపరిమితిని ఎంచుకోవడంలో పదవీ విరమణ వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట కాలపరిమితి, పదవీ విరమణ వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అది రుణ కాలపరిమితిగా నిర్ణయిస్తారు. అదే వృత్తి నిపుణులు, వ్యాపారస్తులకైతే 65 ఏళ్ల వరకు రుణం చెల్లించడానికి అనుమతిస్తారు.
చెల్లింపు సామర్థ్యం
రుణ మంజూరు, ఎంత రుణం వస్తుందన్నది మీ చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బ్యాంకులు అనేక అంశాలను పరిశీలించి చెల్లింపు సామర్థ్యంపై అంచనాకి వస్తాయి. సాధారణంగా వివాహమై కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తి విషయంలో నెల జీతంలో 40 శాతానికి మించి ఈఎంఐ లేకుండా చూస్తారు. అదే ఎటువంటి బాధ్యతలు లేని వారికి మాత్రం మొదటి ఐదేళ్లు నెల జీతంలో 60 శాతం వరకు ఈఎంఐకి అనుమతిస్తారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు గృహరుణాలకు దరఖాస్తు చేసుకుంటే, పదవీ విరమణ తర్వాత రుణం చెల్లించే విధంగా తక్కువ వయసు ఉన్న మరో వ్యక్తిని కో-అప్లికెంట్‌గా పెట్టుకోవడానికి కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి.
అర్హతలు..!
ఒకసారి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత బ్యాంకులు లేదా ఇతర గృహరుణ సంస్థలు రెండు అంశాలను పరిశీలించిన తర్వాతనే రుణాన్ని మంజూరు చేస్తాయి. అందులో మొదటిది వ్యక్తిగత సమాచార పరిశీలన. మీరిచ్చిన కాగితాల ఆధారంగా మీ ఆర్థిక సామర్థ్యాన్ని లెక్కించి రుణం ఇవ్వచ్చా లేదా అన్న అంశాన్ని లెక్కిస్తాయి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న ప్రాపర్టీ కాగితాలను పరిశీలించి న్యాయపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు.
ఇవి కావాలి..
రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంకులకు విధిగా కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే కస్టమర్ ప్రొఫైల్, నివాసం ఉండే ప్రాంతాలనుబట్టి అదనపు కాగితాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఆదాయ ధ్రువీకరణ పత్రం. దీంతోపాటు శాలరీ స్లిప్, ఫామ్ 16 కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
అదే వ్యాపారస్తులు అయితే లాభనష్టాల స్టేట్‌మెంట్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
మీ గుర్తింపుతోపాటు, నివాస ధ్రువీకరణపత్రాలు కావాలి.
ఎంచుకున్న ప్రాపర్టీకి సంబంధించిన జిరాక్స్ కాపీలను ఇవ్వాలి.