స్మార్ట్వాచ్ల వ్యాపారంపై టైటాన్ దృష్టి
త్వరలో మార్కెట్‌లోకి ఫాస్ట్రాక్, సొనాట బ్రాండ్లలోనూ స్మార్ట్‌వాచ్‌లు!
ముంబై: వాచ్‌లు, జువెలరీ తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా తన స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే కంపెనీ తన పలు బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులోనే సొనాట, ఫాస్ట్రాక్ వంటివి ఉన్నారుు. గత కొన్ని త్రైమాసికాల్లో వాచ్‌ల బిజినెస్‌లో వృద్ధి మందగించడం వల్ల కంపెనీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టైటాన్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో జెక్‌టస్ ప్రొడక్ట్‌తో స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
‘మంచి లుక్, స్మార్ట్ ఫీచర్లతో జెక్‌టస్ వాచ్‌లను రూపొందించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. దీని తర్వాత జెక్‌టస్ ప్రొ స్మార్ట్‌వాచ్‌లను తెచ్చాం. వీటిని ప్రజలు ఆదరించారు’ అని టైటాన్ వాచెస్ సీఈవో రవి కాంత్ తెలిపారు. తాము త్వరలో పలు వాచ్ బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటి ధర రూ.10,000లోపు ఉండేలా చూస్తామన్నారు. కాగా టైటాన్ కంపెనీ తాజాగా అమెరికాకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ కెన్నెత్ కోలెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.