న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. పీవీ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న ఈ సంస్థ.. సెప్టెంబరు అమ్మకాల్లో మరో రికార్డును సొంతం చేసుకుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. గత నెల పీవీ విక్రయాల టాప్ 10 జాబితాలో ఏకంగా 7 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు వెల్లడైంది. ప్రీమియం హచ్‌బ్యాక్ స్విఫ్ట్ అమ్మకాలు 22,228 యూనిట్లు కాగా, సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన పీవీలలో ఈ కారు నెంబర్ వన్ స్థానాన్ని సొంతంచేసుకుంది.
గతేడాది విక్రయాలు 13,193 యూనిట్లుగా నమోదైయ్యాయి. ఆ తరువాత స్థానంలో నిలిచిన హచ్‌బ్యాక్ ఆల్టో అమ్మకాలు 21,719 యూనిట్లుగా నమోదుకాగా, అంతకుముందు ఏడాది సేల్స్ 23,830 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మూడవ స్థానంలో నిలిచిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ అమ్మకాలు 21,296 యూనిట్లుగా నమోదయ్యాయి. 18,631 యూనిట్ల విక్రయాలతో బాలెనో 4వ స్థానంలో ఉండగా.. కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా 14,425 యూనిట్లతో 5వ స్థానంలో నిలిచింది.
13,252 యూనిట్ల విక్రయాలతో వాగన్ ఆర్ 6వ స్థానంలో, 9,208 యూనిట్ల విక్రయాలతో సెలెరియో 10వ స్థానంలో నిలిచాయి. ఏడవ స్థానంలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ హచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ20 నిలిచింది. సెప్టెంబర్‌లో 12,380 యూనిట్లు అమ్ముడయ్యాయి. 11,224 యూనిట్లతో గ్రాండ్ ఐ10 ఎనిమిదవ స్థానానికి చేరింది. 11,000 యూనిట్ల విక్రయాలతో క్రెటా 9వ స్థానంలో నిలవడం ద్వారా, టాప్ 10లో హ్యుందాయ్ కార్ల జాబితా మూడుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment