ఉక్కునగరం(విశాఖ): దేశీయ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పటికీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక(2015-16) సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఉత్పత్తి, అమ్మకాల్లో మంచి ప్రగతి కనబరచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొమ్మిది నెలలతో పోలిస్తే సేలబుల్ స్టీల్ ఉత్పత్తిలో 21 శాతం వృద్ధి సాధించడంతో పాటు బ్లాస్ట్‌ఫర్నెస్ ఉత్పాదకత, తలసరి నీటి వినియోగం, కార్మిక ఉత్పాదకతలో వృద్ధి సాధించింది. సింటర్, ద్రవ ఉక్కు, వైర్ రాడ్‌ల ఉత్పత్తిలో ఈ మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది. అదే విధంగా ఎగుమతుల్లో 28 శాతం వృద్ధితో రూ. 935 కోట్లకు చేరగా, ఈ తొమ్మిది నెలల్లో అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ. 8,636 కోట్లకు పెరిగాయి.
ఒక్క డిసెంబర్ నెలలోనే 5 లక్షలు టన్నుల అమ్మకాలతో రూ. 1,617 కోట్లు సాధించడం గమనార్హం. అమ్మకాల్లో చూపుతున్న ప్రగతికి గాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ స్టీల్‌ప్లాంట్‌కు వరుసగా రెండోసారి స్టార్ ఫెర్ఫార్మర్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో వార్షిక లక్ష్యాలను అధిగమించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 8,636 కోట్లు
Published Wed, Jan 6 2016 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement
Advertisement