ట్రావెల్ బీమా లేకుంటే కష్టం!
మొన్నటికి మొన్న... బెల్జియంలో పర్యాటకులు బాంబు దాడికి గురయ్యారు. నిజానికి ఈ సంఘటన ఎవ్వరి ఊహలకు కూడా అందలేదు. దీంతో కొందరికి విదేశంలో డబ్బుల్లేక చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తింది. నిజానికి సరైన ప్రయాణ బీమా ఉంటే ఈ పరిస్థితి రాదు. స్నేహితులు, బంధువులు మన భావోద్వేగాలనైతే పంచుకుంటారు. కాకపోతే ఆర్థిక మద్దతు అందించాలంటే సరైన ప్రయాణ బీమాతోనే సాధ్యం. ఇపుడు చాలా కంపెనీలు ఉగ్రవాదుల దాడులకు కూడా కవరేజీ ఇస్తున్నాయి. కానీ అంతర్యుద్ధం వంటి వాటి విషయంలో మాత్రం కవరేజీ ఇవ్వటం లేదు. ట్రావెల్ బీమాతో ఎమర్జెన్సీ సమయాల్లో లభించే ప్రయోజనాలేంటో చూద్దాం...
* హైజాక్ నుంచి వైద్య ఖర్చుల వరకూ కవరేజీ
* ఆఖరి క్షణం అవస్థలకూ బీమాతో చెల్లుచీటీ
హైజాక్ అలవెన్సు:
బీమా ఉన్న వ్యక్తి విదేశీ ప్రయాణం చేస్తుండగా విమానం హైజాక్‌కు గురైందని అనుకుందాం. అలాంటి సమయాల్లో హైజాక్‌లో ఉన్న ప్రతి రోజుకూ అలవెన్స్ చెల్లిస్తారు. కాకపోతే ఈ మొత్తం బీమా పరిధికి లోబడి ఉండాలి.
రాజకీయ నష్టం- తరలింపు:
బీమా ఉన్న వ్యక్తి ఒక దేశాన్ని సందర్శించినపుడు... రాజకీయ అంశాల కారణంగా కొన్ని వర్గాలవారు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించినపుడు పాలసీ వర్తిస్తుంది. పాలసీ దారుడిని సదరు దేశం నుంచి బహిష్కరించినా, అక్కడకు వచ్చే అర్హత లేదని ప్రకటించినా కవరేజీ ఉంటుంది.
* భూకంపం, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వాటి నుంచి తప్పించుకోవటానికి పాలసీ దారుడు ఆ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే దానికి కవరేజీ ఉంటుంది.
* ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుడు తన స్వదేశానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. లేనిపక్షంలో పాలసీదారుడిని వేరొక సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అయ్యే ఖర్చుకూ కవరేజీ ఉంటుంది.
* ఒకవేళ పాలసీదారుడు తన దేశానికి రాలేని పక్షంలో విదేశంలో గరిష్ఠంగా 7 రోజుల పాటు వసతి ఖర్చుల్ని కూడా బీమా కంపెనీ భరిస్తుంది.
ట్రిప్ ఆలస్యమైతే..:
ప్రకృతి వైపరీత్యాలు, టైస్టుల దాడులు, మెడికల్ ఎమర్జెన్సీల వల్ల ట్రిప్ ఆలస్యమైతే వసతి, ఆహారం తదితరాలకు అయ్యే ఖర్చుల్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. యాత్రలకు వె ళ్లేవారెవ్వరూ అక్కడి పరిస్థితులనో, పరిణామాలనో ముందుగా ఊహించలేరు. కానీ బీమా కవరేజీని మాత్రం ముందే తీసుకోగలరు. అందుకే తగిన బీమా కవరేజీతో ఏ ప్రయాణాన్నయినా హాయిగా సాగించవచ్చనేది నా సలహా.
అత్యవసర వైద్య పరిస్థితులు:
విదేశాల్లో ఉన్నపుడు అస్వస్థతతోనో, ప్రమాదం వల్లో ఆసుపత్రిలో చేరితే వెంటనే క్లెయిమును నమోదు చేసి, బీమా కంపెనీ అనుమతి పొందాల్సి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం పాలైతేనే. స్వదేశానికి తిరిగి వచ్చేదాకా చికిత్స చేయించుకోకుండా ఉండటం కష్టమని, అప్పటికప్పుడే చేయించుకోవాలనే పరిస్థితి ఉన్నపుడే క్లెయిమును ఆమోదిస్తారు. అప్పటికే ఉన్న వ్యాధుల వల్ల కాకుండా ఏదైనా ప్రమాదం వల్ల గాయం తగలడం,అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం వంటి సందర్భాల్లోనూ ఈ ప్రయోజనం పొందవచ్చు.
ఎమర్జ్జెన్సీ క్యాష్ అడ్వాన్సు:
పాలసీదారుడి లగేజీ లేదా డబ్బు చోరీకో లేక దోపిడీకో గురైన పక్షంలో... దేశంలో ఉండే పాలసీదారు బంధువులతో సమన్వయం జరిపి... తక్షణ సాయంగా అత్యవసర నగదు అందజేస్తారు. అయితే ఈ మొత్తం పాలసీ పరిమితులకు లోబడి ఉంటుంది.
యాత్ర రద్దు, అంతరాయం, విమానం మిస్ అయినా...:
అనివార్య కారణాల వల్ల పాలసీదారు యాత్రను రద్దు చేసుకున్నా, యాత్రకు అంతరాయం కలిగినా లేదా విమానం మిస్ అయినా కవరేజీ ఉంటుంది. ట్రిప్ ఖర్చులు, క్యాన్సిలేషన్ చార్జీలు కవర్ అవుతాయి. అయితే దీనికి కారణాలు పాలసీలో పేర్కొన్నవి అయి ఉండాలి.
- అమిత్ భండారి
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్