పన్ను విధానాలు స్థిరంగా ఉండేలా చూస్తాం
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
- ఇన్‌ఫ్రా, తయారీ, డిఫెన్స్‌ల్లో అవకాశాలు
- అమెరికన్ ఇన్వెస్టర్లతో భేటీలో జైట్లీ
న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు సముచితంగాను, స్థిరంగా ఉండేలా చూస్తామని అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఇక్కడి ఇన్‌ఫ్రా, తయారీ, రక్షణ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యాపారావకాశాలు అందిపుచ్చుకోవాలని ఆహ్వానించారు. సోమవారం ఇక్కడ 11వ ఇండో-యూఎస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం మరికొన్నేళ్లలో అయిదు రెట్లు ఎగిసి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ .. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. స్థిరమైన విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం తదితర చర్యలతో ఎకానమీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. పన్నులకు సంబంధించి వారసత్వంగా వచ్చిన సమస్యలను చట్టాలపరంగా, న్యాయస్థానాల తీర్పులపరంగా, విధాన నిర్ణయాల రూపంలోనూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజా సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.