
బడ్జెట్ అంచనాలు... ఫలితాలు కీలకం!
• రిపబ్లిక్ డే కారణంగా గురువారం సెలవు
• ట్రంప్ రక్షణాత్మక విధానాలతో రచ్చే
• ఎఫ్ అండ్ ఓ ముగింపుతో ఒడిదుడుకులు
• మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనా
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్ట్ ట్రంప్ విధానాలు, తదనంతర పరిణామాలు మన స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. గణతంత్ర దినోత్సవం కారణంగా ఈ నెల 26 గురువారం కారణంగా ఆ రోజు మార్కెట్ పనిచేయదు. అందుకని నాలుగు రోజులే ట్రేడింగ్ ఉన్న ఈ వారంలో కీలకమైన కంపెనీలు వెలువరించే క్యూ3 ఫలితాలు, బడ్జెట్ అంచనాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లో చలిస్తాయని మార్కెట్ విశ్లేషకులం ఉవాచ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ. తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు.
డొనాల్ట్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని ప్రభుదాస్ లీలాధర్ బ్రోకింగ్ సంస్థ సీఈఓ, చీఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అజయ్ బోడ్కే చెప్పారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా అమెరికా ఉద్యోగాలు అమెరికావాసులకేనని, హెచ్ 1 వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న గతంలోని విధానాలనే డొనాల్ట్ ట్రంప్ పునరుద్ఘాటన చేసిన విషయం తెలిసిందే. డొనాల్ట్ ట్రంప్ రక్షణాత్మక ఆర్థిక విధానాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ చెప్పారు. ఈ వారంలో ట్రంప్ విధానాలు, కంపెనీల క్యూ3 ఫలితాలు, రానున్న బడ్జెట్.. ఈ అంశాలపైననే దృష్టి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు.
కీలక కంపెనీల ఫలితాలు
హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, తదితర సంస్థలు తమ క్యూ3 ఫలితాలను ఈ వారంలోనే వెలువరిస్తాయని, బడ్జెట్ ముందు ఈ ఫలితాల ప్రభావం ఉంటుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ చెప్పారు. నేడు (23న–సోమవారం)హిందుస్తాన్ యూనిలివర్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐడియా సెల్యులర్ కంపెనీలు, మంగళవారం(24న) భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, బుధవారం(25న) గెయిల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, విప్రో కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి.
ఒడిదుడుకులు
ఈ వారంలోనే డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టులు ముగియనున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీ ఒకింత విరామం ఉండొచ్చని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అభిప్రాయపడ్డారు. తదుపరి మార్కెట్ గమనాన్ని నిర్దేశించే బడ్జెట్ కోసం మార్కెట్ వేచి చూస్తోందన్నారు.
తరలిపోతున్న విదేశీ నిధులు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.5,145 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే మన వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని బజాజ్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ అనిల్ చోప్రా చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,255 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,890 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారని డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.