సంక్షేమానికి ట్రంప్ కోత
కాంగ్రెస్‌కు బడ్జెట్ ప్రతిపాదనలు
► పాక్‌కు సైనిక సాయం రుణంగా మార్పు
వాషింగ్టన్: ఇంతవరకూ విదేశీయులపై అక్కసును, విద్వేషాన్ని వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అమెరికన్లను టార్గెట్ చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, వైద్య సాయానికి భారీగా కోతలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
పలు సంక్షేమ పథకాలకు కేటాయిం పుల్లో కోత పెట్టి వచ్చే పదేళ్లలో 3.6 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.234 లక్షల కోట్లు) ఖర్చు తగ్గిస్తామంటూ బడ్జెట్ ప్రతిపాదనల్లో ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ సాయంపై ఆధారపడ్డ పేద, మధ్య తరగతి ప్రజలు వణికి పోతున్నారు. కాగా పాకిస్తాన్‌కు ఇస్తున్న సైనిక సాయాన్ని రుణంగా మార్చాలని కూడా నిర్ణయిం చారు. 2018 బడ్జెట్ ప్రతిపాదనల్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం సోమవారం ఆ దేశ కాంగ్రెస్‌కు పంపింది.
ఆరోగ్య బీమాపై తీవ్ర ప్రభావం: వైద్య సాయం, వార్షికాదాయం తక్కువగా ఉన్నవారికిచ్చే ఫుడ్ స్టాంప్స్(కూపన్లు), విద్యార్థుల చదువు కోసం రుణాలపై కోతపెట్టడం వల్లే వచ్చే పదేళ్లలో 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ. 117 లక్షల కోట్లు) ఆదా అవుతాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీంతో అనేక లక్షల మంది పేదలు, వికలాంగులు ప్రభుత్వ ఆరోగ్య బీమా పాలసీకి దూరం కానున్నారు.
ప్రస్తుతం అమెరికాలో పేదలలు, మధ్య తరగతి ప్రజలు, 17.5 లక్షల మంది మాజీ సైనికులు ప్రభుత్వ ఆరోగ్య బీమాతో లబ్ధి పొందుతున్నారు. తాజా నిర్ణయంతో ఆరోగ్య బీమా ప్రీమియంలు 20 శాతం పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రక్షణ రంగానికి వచ్చే ఏడాది అదనంగా 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.62 లక్షల కోట్లు) పెంచాలని ప్రతిపాదించారు. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లను కేటాయించారు. అయితే ఎంతో కీలకమైన వాతావరణ పరిరక్షణకు నిధులపై కోత పెట్టారు.