స్టాక్ మార్కెట్
ట్రంప్ సుంకాల దెబ్బకు మన స్టాక్ మార్కెట్ సోమవారం కుదేలైంది. ఫిబ్రవరిలో సేవల రంగం గణాంకాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో 12,000 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. రూపాయి బలపడడంతో ఐటీ షేర్లు లాభపడడం, యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్300 పాయింట్ల నష్టంతో 33,747 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 10,359 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ రెండు వారాల కనిష్టానికి, నిఫ్టీ 11 వారాల కనిష్టానికి పడిపోయాయి. లోహ, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, వాహన షేర్లు కుదేలయ్యాయి. ట్రంప్ సుంకాల కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. లోహ, వాషన షేర్లు పతనమయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ నష్టపోయాయి.
నష్టాలతో ఆరంభం...
సెన్సెక్స్ 34.034 పాయింట్ల వద్ద బలహీనంగా ఆరంభమైంది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో 394 పాయింట్ల నష్టంతో 33,653 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 134 పాయింట్లు నష్టపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయింది. లోహ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యలు మన మార్కెట్‌ను పడగొట్టాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే డాలర్‌తో రూపాయి మారకం బలపడడం నష్టాలను తగ్గించిందని పేర్కొన్నారు. మార్కెట్ పతనం నేపథ్యంలో పెరిగినప్పుడల్లా విక్రయించే విధానాన్ని అవలంభించాలని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ సూచించారు.
లోహ షేర్లు వెలవెల..
అమెరికాలోకి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల పై సుంకాలు విధించనున్నామన్న ట్రంప్ ప్రకటనతో లోహ షేర్లు కళ తప్పాయి. ఎన్‌ఎమ్‌డీసీ 5.8%, నాల్కో 5%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.6%, జిందాల్ స్టీల్ 4.3%, హిందాల్కో 4.2%, సెయిల్ 3.5%, టాటా స్టీల్ 2.9%, వేదాంత 2.5% నష్టపోయాయి.
టాటా మోటార్స్ 5 శాతం డౌన్: టాటా మోటార్స్ 5 శాతం నష్టపోయి రూ. 352 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి రూ.351ను తాకింది. కంపెనీకి చెందిన లగ్జరీ బ్రాండ్ జేఎల్‌ఆర్ అమ్మకాలు తగ్గడం, యూరప్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే కార్లపై కూడా సుంకాలు విధిస్తామని డొనాల్డ్‌ట్రంప్ వ్యాఖ్యానించడం ఈ షేర్‌ను పడగొట్టాయి. జేఎల్‌ఆర్‌కు అమెరికా రెండో అతి పెద్ద మార్కెట్.
ఎదురీదిన ఐడీబీఐ బ్యాంక్: మార్కెట్ భారీగా పతనమైనప్పటకీ ఐడీబీఐ బ్యాంక్ 5% లాభంతో రూ.84 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వంనకు పలు రేటింగ్ ఏజెన్సీలు పెంచడంతో ఈ షేర్ ఇంట్రాడేలో 10%కి పైగా లాభపడి తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.90ని తాకింది. నెల రోజుల్లో ఈ షేర్ 51% పెరగడం విశేషం.
మరిన్ని వివరాలు...
8 ఐటీ రంగానికి ఈ ఏడాది ఆశావహంగా ఉండనున్నదన్న గ్లోబల్ ఎనలిస్ట్ మోషే కత్రి అంచనాలు ఐటీ షేర్లకు ఊపునిచ్చాయి. టీసీఎస్ 2.2 శాతం, టెక్ మహీంద్రా 3 శాతం చొప్పున పెరిగాయి.
8 31 సెన్సెక్స్ షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సన్ ఫార్మా 2.5 శాతం, టీసీఎస్ 2.2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.8 శాతం, ఎస్‌బీఐ 0.4 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.2 శాతం, ఎన్‌టీపీసీ 0.1 శాతంచొప్పున పెరిగాయి.
8 పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.12,636 కోట్ల రుణ కుంభకోణం దర్యాప్తులో భాగంగా సీబీఐ నలుగురిని అరెస్ట్ చేయడంతో గీతాంజలి జెమ్స్ షేర్ల పతనం 13వ ట్రేడింగ్ సెషన్‌లోనూ కొనసాగింది. ఈ షేర్ మరో 5% పతనమైంది. పీఎన్‌బీ స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే ఈ షేర్ 70% కుదేలైంది.
8 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న వార్తల కారణంగా బీఈఎమ్‌ఎల్ షేర్ 10 శాతం లాభపడింది.
8 రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.4%, కోల్ ఇండియా 2.3 శాతం, ఓఎన్‌జీసీ 2.1%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2 శాతం, యస్ బ్యాంక్ 1.9 శాతం, హిందుస్తాన్ యూనిలివర్1.9 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.3 శాతం, ఐటీసీ 1.2 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.2 శాతం చొప్పున నష్టపోయాయి.
పతనానికి పంచ కారణాలు..
వాణిజ్య యుద్ధాల భయం
అమెరికాలోకి దిగుమతయ్యే ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం మేర సుంకాలు విధించనున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడం ప్రపంచ మార్కెట్లను పతన బాట పట్టించింది. ఇలాంటి రక్షణాత్మక విధానాల వల్ల వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయని, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బతీస్తుందని విశ్లేషకులంటున్నారు.
ఆరు నెలల కనిష్టానికి సేవల రంగం
భారత సేవల రంగం గత నెలలో ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. డిమాండ్ బలహీనంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు తగ్గాయి. జనవరిలో 51.7గా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత నెలలో 47.8కి పడిపోయింది.
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు: గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,000 కోట్ల మేర ఈక్విటీ విక్రయాలు(ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి) జరపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మన మార్కెట్ చోదకానికి కీలకమైన విదేశీ నిధులు తరలిపోతుండడం ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఆసియా మార్కెట్ల పతనం
చైనాలో వార్షిక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కావడం, ఇటలీలో హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలున్నాయన్న వార్తలకు తోడు ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు తెరతీస్తాయన్న ఆందోళన కారణంగా ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఇక్కడి ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాలైన యెన్ కరెన్సీ, పుత్తడిలకు తమ పెట్టుబడులను తరలించారు. దీంతో హాంగ్‌కాంగ్ సూచీ 2.2%, జపాన్ నికాయ్ 0.6%,
కోస్పి 1.1% చొప్పున క్షీణించాయి.
పెరుగుతున్న వడ్డీ వ్యయాలు
మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్స్(ఎమ్‌సీఎల్‌ఆర్)ను ఎస్‌బీఐ ఇటీవలనే పెంచింది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పెంచగా, మరికొన్ని బ్యాంక్‌లు ఇదే బాటలో ఉన్నాయి. ఫిబ్రవరి పాలసీలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచకపోయినప్పటికీ, ఎమ్‌సీఎల్‌ఆర్ పెంపు కారణంగా వడ్డీ రేట్లు పెరుగుతాయని, ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు, కంపెనీలకు భారమని నిపుణులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment