ఉబెర్ కొత్త సీఈవో ఎవరంటే..
శాన్ ఫ్రాన్సిస్కో: శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ కంపెనీ కొత్త సీఈవో నియామకం పూర్తి అయింది. ఇటీవలి అంచనాలకు భిన్నంగా అమెరికా ట్రావెల్ కంపెనీ ఎక్స్ పీడియాకు చెందిన దారా ఖోస్రోషాహిని సీఈవోగా ఉబెర్‌ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రావిస్ కాలనిక్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ నియామకం జరిగింది.
ఆదివారం రాత్రి కంపెనీ జారీ చేసిన ప్రకటన ప్రకారం అనూహ్యంగా రేస్‌లో లేని ఇరాన్ కు చెందిన ఖోస్రోషాహిని కొత్త సీఈవోగా ఎంపిక చేయడం విస‍్మయపర్చింది. జెఫ్ ఇమ్మెల్ట్, జనరల్ ఎలెక్ట్రిక్ మాజీ సీఈవో, హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజెస్ అధిపతి మెగ్ విట్‌మన్ ఉబెర్ సీఈవో రేసులో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అయితే బోర్డుతో విబేధాల కారణంగా ఉబెర్‌లో జాయిన్ అయ్యే యోచన లేదని విట్మన్ స్పష్టం చేశారు.
మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా గుర్తింపు పొందిన ఉబెర్‌లో... పురుషాధిపత్య సంస్కృతి, మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ వాటాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఈవో రాజీనామా చేయక తప్పలేదు. ఉబెర్ మాజీ సైట్ ఇంజనీర్ అయిన సుసాన్ ఫౌలర్ తన సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్ లో తన మాజీ అధికారులపై లైంగిక ఆరోపణల చేయడం వైరల్ అయింది. దీంతో సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపు, వివక్షత, బెదిరింపు మరియు అనైతిక ప్రవర్తన తదితర 200 ఆరోపణలతో యుబర్ అప్పటికే 20 మంది ఉద్యోగులను తొలగించింది.
కాగా 2015నుంచి ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండవ త్రైమాసికంలో యుబెర్ సేల్స్ గత త్రైమాసికం నుంచి 17 శాతం పెరిగి రెండవ త్రైమాసికంలో 1.75 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.