సాక్షి, న్యూడిల్లీ: భారతీయ కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. కొత్త కార్లను కొనుగోలు ఉచ్చులో పడొద్దని భారతీయులను కోరారు. దీనికి బదులు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవడానికి తగిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎస్టాబ్లిష్‌డ్ పరిశ్రమలకు దూరంగా వుండాలని హితవు చెప్పారు. ముఖ్యంగా ఆటోరంగం మందగమనానికి దోహదపడే అనేక అంశాలలో ఉబెర్, ఓలా వల్లే యువతరం (మిలీనియల్స్) కార్ల కొనుగోలుకు మొగ్గు చూపకపోవడం కూడా ఒకటి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉబెర్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఇలా సొంతకార్లను కలిగి వుండటం కొన్నిసార్లు ఆవిష్కరణలను నిరోధిస్తుందన్నారు. ఫలితంగా రాబోవు 10-20 సంవత్సరాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలకు బదులుగ గత పది సంవత్సరాలకోసం రూపొందించిన వాటినే ఇప్పటికీ వాడుతున్నామన్నారు.అందుకే కారు సొంతం చేసుకోవడం అనేది నేటి తరం కలగాకూడదు, కోరుకున్నపుడు స్వేచ్ఛగా ప్రయాణించే సౌకర్యాలు, అలాంటి ఆవిష్కరణలు, పరిశ్రమలపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాదు పాతుకుపోయిన పరిశ్రమలు, పద్ధతులు నూతన ఆవిష్కరణలకు శత్రువులుగా మారాయని వ్యాఖ్యానించారు. దీన్ని అధిగమిస్తే భారత్ ఈ రంగంలో అగ్రగామిగా వుంటుందని ఖోస్రోషాహి పేర్కొన్నారు.
కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)తో కలిసి ఉబెర్ తాజాగా మరో నూతన ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫీచర్‌ద్వారా మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల ద్వారా క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఉబెర్ ఇపుడు బస్సులను కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీలో మంగళవారం విడుదల చేసింది. దీనిని ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రధాన రూట్లలో నడుపుతారు. ఒకవేళ విజయవంతమైతే అన్ని చోట్లకూ, అన్ని ప్రధాన నగరాలకూ విస్తరిస్తామని ఆయన తెలిపారు. యాప్‌లో వినియోగదారులు తమ పికప్, డ్రాపింగ్ పాయింట్లను లోడ్ చేసుకోవాలి. అయితే నిర్ణీత ప్రదేశంలో (బస్‌స్టాప్‌ల్లాగా అన్నమాట)మాత్రమే ఎక్కాలి తప్ప ఇంటి వరకూ రాదు. చాలా తక్కువ ధరలో, తక్కువ సమయంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యమని ఉబెర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment