ఉబర్ సీఈవోకు మరో కోలుకోలేని దెబ్బ
ఉబర్ సీఈవోకు మరో కోలుకోలేని దెబ్బ
Published Mon, Jun 12 2017 2:43 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
ఉబర్ సీఈవోకు ఇటీవల దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 15 రోజుల క్రితమే తన తల్లి బోటు ప్రమాదంలో మరణించగా.. తండ్రి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే ఆయన్ను కొన్ని రోజుల పాటు సీఈవోగా పక్కనపెట్టాలని కంపెనీ బోర్డు సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కంపెనీలో సాగుతున్న లైంగిక వేధింపులు వంటి వివాదస్పద అంశాల నుంచి రికవరీ అవడానికి తాత్కాలికంగా ట్రావిస్ కలానిక్ ను కంపెనీకి దూరంగా ఉంచాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆదివారం రోజు సమావేశమైన మేనేజ్ మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కంపెనీలోని పని వాతావరణం మార్పులపై మాజీ అమెరికా అటార్ని జనర్నల్ ఎరిక్ హోల్డర్ రిపోర్టుపై కూడా ఈ భేటీలో చర్చించారు. వీటిపై రిపోర్టును కంపెనీ మంగళవారం బయటికి వెల్లడించనుంది.
70 బిలియన్ డాలర్లు(రూ.4,50,870కోట్లకు పైగా) విలువైన ఈ స్టార్టప్ ను ఎనిమిదేళ్ల క్రితం ట్రావిస్ కలానిక్, గారెట్ క్యాంపులు కలిసి కాలిఫోర్నియా వేదికగా స్థాపించారు. కలానిక్ ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలానిక్ తో పాటు ఉబర్ బిజినెస్ ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిల్ మైఖెల్ ను కూడా కంపెనీ నుంచి బయటికి పంపేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. కలానిక్ తో పాటు ఏడుగురు బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఈవోగా కలానిక్ తాత్కాలికంగా వైదొలగడమేనా, ఆయనకు ఇది కోలుకోలేని దెబ్బే అని పలువురంటున్నారు. ఈ విషయంపై స్పందించడానికి మాత్రం ఉబర్ నిరాకరించింది.
కంపెనీలో అంతర్గతంగా జరుగుతున్న లైంగిక వేధింపుల, అనైతిక కార్యకలాపాలపై ప్రస్తుతం రెండు లా సంస్థలు పెర్కిన్స్ కోయి, కోవింగ్టన్ అండ్ బుర్లింగ్ లు లోతుగా విచారణ జరుపుతున్నాయి. పెర్కిన్స్ విచారణలో బయటపడిన లైగింక వేధింపులు, అనైతిక ప్రవర్తన సాగిస్తున్న 20 మంది ఉద్యోగులను ఉబర్ యాజమాన్యం తొలగించింది. మరో 100 మందిపై విచారణ సాగిస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్నింగ్ లెటర్లు కూడా పంపింది. గతవారమే కంపెనీ ఎరిక్ అలెగ్జాండర్ అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ను బయటికి పంపించేసింది. ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఓ మహిళ మెడికల్ రిపోర్టులను ఆయన సొంతం చేసుకున్నాడనే నెపంతో ఉబర్ ఆయన్ను తొలగించింది. ఈ అత్యాచార ఘటనపై ట్రావిస్ కలానిక్ అనుమానాలు వ్యక్తంచేసినట్టు గతవారం పలు రిపోర్టులు కూడా వెలువడ్డాయి. ఈ రిపోర్టులను ఎరిక్, ట్రావిస్ కలానిక్, మైఖెల్ కు చూపించినట్టు తెలిసింది. అయినప్పటికీ వారు ఇంకా ఈ ఘటనపై సందేహాలే వ్యక్తం చేసినట్టు కంపెనీకి చెందిన పలువురు చెప్పారు.
Advertisement
Advertisement