యూసీ బ్రౌజర్‌ కనిపించడం లేదు | UC Browser taken down from Google Play Store | Sakshi
Sakshi News home page

యూసీ బ్రౌజర్‌ కనిపించడం లేదు

Published Wed, Nov 15 2017 6:40 PM | Last Updated on Wed, Nov 15 2017 6:40 PM

UC Browser taken down from Google Play Store - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియ‌న్ల మందికి పైగా ఉప‌యోగిస్తున్న మొబైల్ ఇంట‌ర్నెట్ స‌ర్ఫింగ్ అప్లికేష‌న్ యూసీ బ్రౌజ‌ర్, గూగుల్ ప్లే స్టోర్‌లో క‌నిపించ‌డం లేదు. ఇన్‌స్టాల్ చేసుకోవ‌డానికి `యూసీ బ్రౌజ‌ర్‌` అని సెర్చ్ చేస్తే కేవ‌లం యూసీ మినీ యాప్ మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఈ విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక వివరణను ప్రకటించనప్పటికీ, యూసీ బ్రౌజర్‌పై గతంలో చాలా వివాదాలు వచ్చాయి. యూసీ బ్రౌజర్‌ యూజర్ల డేటాను దొంగతనం చేస్తుందని, దీన్ని చైనాలో సర్వర్లకు పంపిస్తుందని గత ఆగస్టులో ఆరోపణలు వచ్చాయి. ఈ బ్రౌజర్‌ను యూజర్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేసినప్పటికీ డేటాను సేకరిస్తుందని రిపోర్టులు తెలిపాయి. ఈ బ్రౌజర్‌పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. 

యూసీ బ్రౌజర్‌ తాత్కాలికంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఇన్‌స్టాల్స్ సంఖ్య‌ను పెంచ‌డం కోసం త‌ప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వ‌చ్చిన‌ట్లు అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ల‌ను యూసీ బ్రౌజ‌ర్ ఇస్తుంద‌ని, ఇది ఆండ్రాయిడ్ పాల‌సీల‌కు విరుద్ధం కావ‌డంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజ‌ర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొల‌గించింద‌ని ఓ మేగ‌జైన్‌ పేర్కొంది. యూసీ బ్రౌజర్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాజా ఘటనపై స్పందించారు. 'నాకు ఈరోజు ఉదయం ఓ మెయిల్‌ వచ్చింది. యూసీ బ్రౌజర్‌ను 30 రోజులపాటు తాత్కాలికంగా ప్లేస్టోర్‌ నుంచి తీసివేస్తున్నట్లు అందులో సమాచారం ఉంది. డౌన్‌లోడ్లు పెంచుకునేందుకు యూజర్లను తప్పుదారి పట్టించినందుకు, అనారోగ్యకర విధానాలను అవలంబించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది'' అని అతను పేర్కొన్నాడు. కాగ యూసీ బ్రౌజర్‌ మినీ, యూసీ న్యూస్‌ ఇంకా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement