
ఫైనాన్షియల్ రంగంలో ఒకేఒక్కడు ఉదయ్ కొటక్
♦ ఫోర్బ్స్ ప్రపంచ టాప్-40 జాబితాలో
♦ భారత్ నుంచి చోటు...
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ రంగంలో అత్యంత శక్తివంతమైన 40 మంది జాబితాలో భారత్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ నిలిచారు. ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్టులో ఆయన 33వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. 7.1 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన ఉదయ్ కొటక్.. 34.6 బిలియన్ డాలర్ల కొటక్ మహీంద్రా బ్యాంక్ అసెట్స్‌ను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది.
వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ఈయన సారథ్యంలోని కొటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీని ఇస్తోందని, ఇది కష్టసాధ్యమని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ జాబితాలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈవో స్టీఫెన్ షార్జ్‌మాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద విలువ 10.2 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. ఇక జాబితాలో జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈవో జామీ డిమోన్(3వ స్థానం), బెర్క్‌షైర్ హాత్‌వే హెడ్ వారెన్ బఫెట్ (4), గోల్డ్‌మన్ శాక్స్ చైర్మన్ లాయిడ్ బ్లాన్క్‌ఫీన్ (9), సరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ చీఫ్ జార్జ్ సరోస్(10) తదితరులు ఉన్నారు.