
మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
♦ కానీ సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు
♦ టాటా స్టీల్ యూకే వ్యాపారంపై బ్రిటన్ ప్రధాని కామెరాన్
లండన్: నష్టాల్లో కూరుకుపోయిన టాటా స్టీల్ యూకే సంస్థలో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తోందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. ‘‘మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేం’’ అన్నారాయన. భారతదేశ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్... నష్టాల్లో ఉన్న తమ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కామెరాన్ క్యాబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి కంపెనీని జాతీయం చేయడం పరిష్కారం కాదని, కానీ ఏ అవకాశాలనూ తోసిపుచ్చలేమని చెప్పారు.
‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగం కష్టాల్లో ఉంది. ధరలు పతనమయ్యాయి. సరఫరా పెరిగిపోయింది’’ అని క్యాబినెట్ సమావేశం అనంతరం కామెరాన్ విలేకరులతో వ్యాఖ్యానించారు. మరోవైపు, కొనుగోలుదారు దొరికే దాకా ప్లాంట్లను మూసివేయకుండా కొనసాగిస్తామనే హామీని టాటా స్టీల్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లుగా ‘బీబీసీ’ ఒక కథనం వెలువరించింది. టాటా గ్రూప్.. తమ వ్యాపారాన్ని విక్రయించడం కంటే ప్లాంట్లను మూసివేయడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చన్న అంశం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని ఈ కథనంలో పేర్కొంది.
ప్లాంట్లు ఎంతకాలం నడుస్తాయన్న దానిపై కంపెనీ నుంచి నిర్దిష్ట హామీని ప్రభుత్వం దక్కించుకోలేకపోయింది. దీంతో కొనుగోలుదారు ఎవరైనా ముందుకు రావడం లేదా జాతీయం చేయడం లేదా ప్లాంటును మూసివేసేందుకు అంగీకరించడం తదితర అంశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అలాగే కొనేందుకు ముందుకొచ్చే సంస్థలకు రుణ హామీలు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.