న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది.
ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్‌లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్‌క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment