డిజిన్వెస్ట్‌మెంట్ @ రూ.72,500 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. డిజిన్వెస్ట్‌చేయదల్చిన పీఎస్‌యుల్లో 3 రైల్వే పిఎస్‌యులు( ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సి, ఐఆర్‌సిఒఎన్) కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచ స్థాయి పిఎస్‌యులతో పోటీపడేలా దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం కొన్నింటి విలీనం, కొన్నింటి కన్సాలిడేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో ఎదురైన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పిఎస్‌యుల లిస్టింగ్‌ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా, ఉపసంహరణ ప్రక్రియలో జవాబుదారీతనం పెరిగేలా, కంపెనీల వాస్తవ విలువ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.56 వేల కోట్లుగా నిర్ణయించుకున్నా, చివరకు రూ. 45వేల కోట్లనే సమీకరించింది. 10 పిఎస్‌యుల షేర్లతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్‌కు మంచి స్పందన వచ్చిందని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది మరో కొత్త ఈటీఎఫ్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు.