ఉక్రెయిన్- రష్యాలపై దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేయనున్నాయని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా ఉక్రెయిన్-రష్యాల మధ్య ఏర్పడ్డ టెన్షన్ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశీయంగా రిటైల్, టోకు ధరల వేగం తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ పాలసీపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. కాగా, ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. హోలీ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సోమవారం(17న) సెలవు ప్రకటించారు.
ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధభయాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు వివరించారు. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా నిర్వహిస్తున్న రెఫరెండంపై మార్కెట్లు దృష్టిపెడతాయని, ఈ అంశంలో చెలరేగే ఆందోళనలు ఇండెక్స్‌లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రిమియాలో రెఫరెండంకు సంబంధించి ఇప్పటికే గత వారం చివర్లో సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపారు.
పాలసీ యథాతథం?
రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం ఉపశమించడంతో వచ్చే నెల 1న నిర్వహించనున్న పరపతి సమీక్షలో ఆర్‌బీఐ ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో నెలకొన్నదని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) పుంజుకోకపోవడం వంటి అంశాల మధ్య ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ విశ్లేషించారు. ఇది మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని అంచనా వేశారు. ఫిబ్రవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం గత 9 నెలల్లో తొలిసారి 5% దిగువకు చేరింది. తద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా పాలసీ సమీక్షను చేపట్టేందుకు ఆర్‌బీఐకి అవకాశం చిక్కిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఇది దారితీయవచ్చ చెప్పారు.
అనిశ్చితి ఉన్నా...
అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలోనూ గతవారం దేశీయ మార్కెట్లు పటిష్టంగా ట్రేడయ్యాయని, అయితే హెచ్చుతగ్గులు అధికంగా నమోదుకావడం గమనించదగ్గ విషయమని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు. మార్కెట్లలో ఒడిదుడుకులు సహజమే అయినప్పటికీ ఇది ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు సమస్యాత్మకంగా పరిణమిస్తుందని విశ్లేషించారు. వెరసి మార్కెట్లపై అవగాహనతో కూడిన స్పష్టమైన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని సూచించారు.
మొదట ఫెడ్ వంతు...: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 18-19న పాలసీ సమీక్ష సమావేశాలను నిర్వహించనుంది. సహాయక ప్యాకేజీలలో కోతను పెంచే అవకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. గతేడాది మే నెలలో ప్యాకేజీలలో కోతను విధించనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఈ జనవరి, ఫిబ్రవరిలో చెరో 10 బిలియన్ డాలర్ల చొప్పున ప్యాకేజీలో కోతవిధించింది. దీంతో నెలకు 60 బిలియన్ డాలర్లకు ప్యాకేజీ పరిమితమైంది. ఈ కోత మరింత పెరిగితే వర్థమాన మార్కెట్లలో పెట్టుబడులు క్షీణిస్తాయన్న అంచ నాలు పెరుగుతాయి. ఇది స్టాక్స్‌లో అమ్మకాలకు పురిగొల్పవచ్చనేది నిపుణుల విశ్లేషణ!
నేడు మార్కెట్లకు సెలవు
హోలీ పండుగ సందర్భంగా
సోమవారం(17న) స్టాక్ ఎక్స్ఛేంజీలతోపాటు ఫారెక్స్, మనీ, కమోడిటీ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మంగళవారం యథావిధిగా ట్రేడింగ్ ఉంటుంది.
2 వారాల్లో రూ. 5,000 కోట్లు!
దేశీ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ నెల తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 5,068 కోట్ల(82.8 కోట్ల డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. కాగా, ఇదే కాలంలో రుణ సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 14,140 కోట్లు(2.3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కరెంట్ ఖాతా లోటు భారీగా క్షీణించడం, ద్రవ్యోల్బణం ఉపశమించడం వంటి అంశాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.