యుద్ధ మేఘాలు ఉఫ్
యుద్ధ భయాలు తొలగడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ జోష్‌లోకొచ్చాయి. ఉక్రెయిన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించేందుకు రష్యా నిర్ణయించడంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. వెరసి ఆసియా మొదలు, యూరప్, అమెరికా స్టాక్ ఇండెక్స్‌లు పుంజుకున్నాయ్. దీంతో గత ఏడు వారాల్లో లేని విధంగా సెన్సెక్స్ సైతం 263 పాయింట్లు ఎగసింది. 21,210 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఆరు వారాల గరిష్టంకాగా, 76 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,298 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 6,300ను అధిగమించింది. సెన్సెక్స్ ఇంతక్రితం జనవరి 13న మాత్రమే ఈ స్థాయిలో 376 పాయింట్లు ఎగసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ రంగాలు 3-2% మధ్య ఎగశాయి.
ఎఫ్‌ఐఐల అండ...
యుద్ధ వాతావరణం నేపథ్యంలోనూ ఎఫ్‌ఐఐలుపెట్టుబడులకే కట్టుబడటం దేశీయంగా సెంటిమెంట్‌కు బలాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. సోమవారం రూ. 198 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 186 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 345 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి పుంజుకోగా, చమురు ధరలు బలహీనపడ్డాయి.
మరిన్ని విశేషాలివీ...
మెటల్ షేర్లలో హిందాల్కో 8% జంప్‌చేయగా, సెసాస్టెరిలైట్, హిందుస్తాన్ జింక్, ఎన్‌ఎండీసీ, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ 5-2.5% మధ్య పుంజుకున్నాయి.
బ్యాంకింగ్‌లో యస్ బ్యాంక్, బీవోబీ, పీఎన్‌బీ, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, కెనరా, ఎస్‌బీఐ 6-2% మధ్య పురోగమించాయి.
క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లలో క్రాంప్టన్ గ్రీవ్స్, థెర్మాక్స్, భెల్, టాటా పవర్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ 4-2% మధ్య లాభపడ్డాయి.
సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ 2% చొప్పున లాభపడగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే (నామమాత్రంగా) నష్టపోయాయి.
మిడ్ క్యాప్స్‌లో హెచ్‌ఎంటీ, ఆషాహీ, ధనలక్ష్మీ బ్యాంక్, టిమ్‌కెన్, ఆస్ట్రాజెనెకా, బీఏఎస్‌ఎఫ్, శ్రేయీ ఇన్‌ఫ్రా, టాటా ఇన్వెస్ట్, అనంత్‌రాజ్, కోల్టేపాటిల్, టాటా కెమ్, ఐవీఆర్‌సీఎల్ తదితరాలు 16-8% మధ్య దూసుకెళ్లాయి.
సహారా గ్రూప్ షేర్లు సహారా హౌసింగ్ ఫైనాన్స్, సహారా వన్‌మీడియా 4%పైగా పుంజుకున్నాయి.
యూరప్ దూకుడు
ఉక్రెయిన్-రష్యాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఆవిరికావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు ఉపశమనం లభించింది. దీంతో యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే 2%పైబడ్డ లాభాలతో కదులుతున్నాయి. అంతకుముందు ఆసియా ఇండెక్స్‌లు సైతం సోమవారంనాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. కాగా, వడ్డీ రేట్లపై యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రెండు రోజులపాటు సమావేశం కానుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి అటు మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. కడపటి వార్తలందేసరికి అమెరికా స్టాక్ సూచీలు 1% లాభాలతో ట్రేడవుతున్నాయి.