విహారయాత్ర.. ఇలా జాలీగా | Vacation Every month some allocation! | Sakshi
Sakshi News home page

విహారయాత్ర.. ఇలా జాలీగా

Published Mon, Aug 29 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

విహారయాత్ర.. ఇలా జాలీగా

విహారయాత్ర.. ఇలా జాలీగా

ఆఫీసులో సెలవుల లిస్టు రాగానే ముందుగా... వీక్లీ ఆఫ్ కూడా కలిసొచ్చేలా సుదీర్ఘ వారాంతపు సెలవలేమైనా ఉన్నాయేమోనని మనలో చాలా మంది చకచకా లెక్కలు కడుతుంటాం. ఒకవేళ ఒకరోజో, రెండు రోజులో మధ్యలో గ్యాప్ గానీ వస్తే వీలైతే లీవ్ పెట్టుకునైనా విహారయాత్రకు వెళ్లే వీలుంటుందేమో చూసుకుంటాం. ఏడాది పొడవునా ఉండే ఆఫీసు బాదర బందీ నుంచి దూరంగా కొంత సేపైనా గడిపితే బాగుంటుందనుకుంటాం. ఇదంతా బాగానే ఉంటుంది. కానీ నిజంగానే విహారయాత్రకు  బయలుదేరాలంటే... ఎదురయ్యే ఖర్చులు కళ్లముందు కదులుతాయి.

రైలు, బస్సు టికెట్ మొదలుకుని హోటల్‌లో గదుల అద్దె, తిండీ తిప్పలు, ప్రయాణ ఖర్చులూ అన్నీ గుర్తొస్తాయి. మూణ్నాలుగు రోజుల భాగ్యానికి అప్పు చేసి మరీ ఏడాది పొడవునా కట్టుకుంటూ కూర్చోవడం అవసరమా అనిపిస్తుంది. ప్రయాణం అటకెక్కుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే.. ఇలా వెకేషన్‌ను అటకెక్కించకుండా నిశ్చింతగా తిరిగి రావొచ్చు. అదెలాగో చూద్దాం.


* వెకేషన్‌కూ ప్రతి నెలా కొంత కేటాయింపు    
* ముందస్తు ప్రణాళికతో ఖర్చుల అదుపు    
* రాయితీల మీద దృష్టి అవసరం

 
నిజానికి విహారయాత్రనేది వృథా ఖర్చు కాదు. ఇది ఒకరకంగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెట్టుబడి. అందుకే నెలవారీగా మిగతా ఖర్చులు, పెట్టుబడులకు జీతంలో నుంచి కేటాయింపులు జరిపినట్లే.. దీనికి కూడా కొంత కేటాయించాలి. వెకేషన్ కోసం మీ వార్షికాదాయంలో కనీసం 5 శాతం కేటాయించొచ్చు. వెసులుబాటును బట్టి 7 శాతం దాకా పక్కన పెట్టొచ్చు. అంతకు మించి మరీ 10 శాతం దాకా పెడితే.. మీ పెట్టుబడి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
 
బసకి హోమ్‌స్టే లేదా ఎయిర్‌బీఎన్‌బీ..
సుదీర్ఘమైన సెలవులు గడిపేందుకు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్స్ కోసం వెతుక్కుంటూ కూర్చోకుండా... స్వల్ప చార్జీలకు ఆతిథ్యమిచ్చే  హోమ్‌స్టే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీఅండ్‌బీ) తరహా ఆతిథ్యమిచ్చే వారు ఉంటారు. వారాంతపు సెలవులో సైట్ సీయింగ్ లేదా ట్రెక్కింగ్ చేయదల్చుకుంటే.. ఇలాంటి హోమ్‌స్టే చౌకగాను, అనువుగాను ఉంటుంది. ఒకవేళ మీకేదైనా క్లబ్‌లో సభ్యత్వం ఉంటే.. మీరు వెళ్లే ప్రాంతాల్లో దానికి శాఖలు గానీ అనుబంధ ప్రాపర్టీలు గానీ ఉన్నాయేమో ఒకసారి పరిశీలిస్తే ఉపయోగ కరంగా ఉంటుంది.

చాలా తక్కువ రేట్లకే స్టార్ హోటల్ సదుపాయాలు ఇలాంటి ప్రాపర్టీల్లో పొందవచ్చు. టైమ్ షేర్ లాంటివి కూడా ఉన్నప్పటికీ ముందుగా తెలియని ఖర్చులు, చార్జీలు, అవసరమైనప్పుడు గదులు దొరక్కపోవడం మొదలైన అంశాల కారణంగా వీటితో సంతృప్తి చెందిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇక పర్యాటకులకు గదులు అద్దెకిచ్చే వారి కోసం ఎయిర్‌బీఎన్‌బీ లాంటి వెబ్‌సైట్లలోనూ వెతుక్కోవచ్చు. రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఒక్కొక్క సందర్భంలో హాలిడే రాయితీలు లభించే అవకాశాలూ ఉంటాయన్న విషయం గమనంలో ఉంచుకోవాలి.
 
కొంత రాజీ పడటంలో తప్పు లేదు..
వెళ్లాలనుకున్న ప్రాంతం, టైమింగ్ లాంటి విషయాల్లో అవసరమైతే కొంత రాజీపడేందుకు వెనకాడనక్కర్లేదు. ఒకోసారి ఇలాంటి వాటి వల్ల ఊహించని కొంగొత్త అనుభవాలు ఎదురుకావొచ్చు. సెలవులు పేరుకుపోయిన పక్షంలో వీలైతే పనిదినాల్లో లీవ్ తీసుకుని హాలిడే వెకేషన్ గడిపేందుకు వెళ్లండి. పీక్ సీజన్ కానప్పుడు హోటళ్ళ టారిఫ్‌లు 50-75 శాతం దాకా తక్కువగా ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి సర్వీసూ మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకు.. గోవా వెళ్లేందుకు నవంబర్ నుంచి మార్చి దాకా రద్దీ సీజన్‌గా ఉంటుంది. మన స్కూళ్లలో ఏప్రిల్, మే నెలల్లోనూ, అక్టోబర్‌లోను సెలవులుంటాయి. టూరిస్ట్ సీజన్‌తో పోలిస్తే ఆఫ్ సీజన్‌లో గోవాలో టారిఫ్‌లు పాతిక శాతం తక్కువగా ఉంటాయి. మళ్లీ డిసెంబర్ 20 నుంచి జనవరి 10 మధ్యలో రేట్లు ఒక్కసారిగా రెట్టింపయిపోతాయి. బీచ్  పక్కనే ఉండే 5 స్టార్ హోటల్, కాస్త కిలోమీటరు లోపల ఉండే 4 స్టార్ హోటల్‌లోనూ రేట్ల వ్యత్యాసం ఒకోసారి దాదాపు 50 శాతం దాకా కూడా ఉంటాయి.
  సీజన్‌లోనూ, ఆఫ్ సీజన్‌లోను దక్షిణ గోవాలోని రెండు హోటళ్లలో ఉన్న రేట్లను ఒకసారి పరిశీలించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
 
(కింద బాక్స్ గమనించగలరు).
చూశారు కదా.. ఇలా వెకేషన్‌కోసం ప్రతి నెలా కొంత కేటాయించి.. ప్రయాణం మొదలుకుని బస దాకా అన్ని విషయాల్లో కాస్తంత ముందస్తు ప్రణాళిక వేసుకుంటే సుదీర్ఘ వారాంతపు సెలవుల్లో విహారయాత్రలను జాలీగా గడిపేయవచ్చు.

ప్రయాణానికి ముందస్తు ప్రణాళిక..
కాస్త ముందునుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే.. ప్రయాణం, బస మొదలైన ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. నా ఉదాహరణే తీసుకుంటే.. కొన్నాళ్ల క్రితం ముంబై నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కి ఫ్లయిట్ టికెట్స్‌ను కేవలం రూ. 700.35కే (వన్ వే-పన్నులు అదనం) కొన్నాను. ఇది నా మిత్రులు చాలా మంది ఇప్పటికీ నమ్మరు. కానీ ఇది నిజం. నా దగ్గర ఇంకా ఆ టికెట్స్ ఉన్నాయి. అప్పట్లో పీక్ వెకేషన్ సీజన్‌కి దాదాపు ఆరు నెలల ముందు కంపెనీ ప్రకటించిన ప్రోమో ఫేర్ ఆఫర్లో నేనా టికెట్లు కొన్నాను. కాబట్టి కాస్త ఓపికగా వెతుక్కోగలిగి, కాస్త ముందుగా కొనుక్కోగలిగితే ఇలాంటి మంచి మంచి డీల్స్ చాలానే దొరకవచ్చు. విమాన ప్రయాణాలే కాదు... రైలు, బస్సు టికెట్లు, హోటల్ ప్యాకేజీలకు కూడా ఇది వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement