ఒక్క బటన్ నొక్కగానే రోడ్డుపై వెళ్లే బస్సు.. రైలులా మారితే? చకచకా పట్టాలపైకెక్కి గమ్యస్థానాన్ని చేరుకుంటే? అక్కడ మళ్లీ పట్టాలు దిగి బస్సుగా మారి రోడ్డు వెంట సాఫీగా సాగిపోతే? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! కానీ ఓ జపాన్ కంపెనీ దీన్ని నిజం చేసింది. బటన్ నొక్కితే చాలు 15 సెకన్లలో బస్సు.. రైలులా, రైలు.. బస్సులా మారేలా ఓ డ్యుయల్ మోడ్ వాహనాన్ని రూపొందించింది. ఈ క్రిస్మస్ సందర్భంగా అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌లోని టొకుషిమా నుంచి కొచి ప్రాంతానికి నడుపుతోంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యుయల్ మోడ్ వాహనం (డీఎంవీ).
రోడ్డుపై టైర్లు.. పట్టాలపై స్టీలు చక్రాలు
జపాన్‌లోని అసా సీసైడ్ రైల్వేస్ తీసుకొచ్చిన ఈ డ్యుయల్ మోడ్ వాహనం మినీ బస్సులా కనిపిస్తుంది. రోడ్డుపై సాధారణ రబ్బర్ టైర్లతో నడుస్తుంది. పట్టాలపైకి వెళ్లాక మాత్రం స్టీలు చక్రాలతో ముందుకు సాగుతుంది. పట్టాలపైకి చేరుకున్నాక బటన్ నొక్కగానే బస్సు ముందు పొట్టలో ఉన్న స్టీలు చక్రాలు బయటకు వచ్చేస్తాయి. వెనుకవైపు కూడా స్టీలు చక్రాలు బయటకు వచ్చి పట్టాలపై సరిగ్గా కూర్చుంటాయి. బస్సు ముందు టైరు పట్టాలకు తాకదు కానీ వెనుక టైరు తాకుతుంది. వెనుక టైరు ఆధారంగానే ఈ రైలు లాంటి బస్సు నడుస్తుంది. ఒకసారి పట్టాలపై చక్రాలు కూర్చున్నాక డ్రైవర్ కిందికి దిగి వాటిని పరిశీలించి అంతా సరిగ్గా ఉందనుకున్నాక ముందుకు సాగుతాడు.
చదవండి: ఏమార్చి... హతమారుస్తుంది
ఇంతకుముందే తయారు చేసినా..
డ్యుయల్ మోడ్ వాహనాలు (రోడ్ రైల్ వాహనాలు) ఇప్పుడే కొత్తగా ఏం కనుగొనలేదు. రైల్వే ట్రాక్‌ల పరిశీలన, నిర్వహణకు గతంలో వీటిని వాడేవారు. 1930ల్లో రోడ్ రైల్ బస్సును బ్రిటన్ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. దీనికి ‘కారియర్ రో రైలర్’ అని పేరు పెట్టింది. కొన్ని నెలలు నడిచాక దీన్ని పక్కనబెట్టారు. ఆ తర్వాత 1970ల్లో ఆస్ట్రేలియాలో, జర్మనీలో కూడా ఇలాంటి కొత్త రకం రైలు బస్సును నడిపి చూశారు.
చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు..
బస్సు పొడవు 8 మీటర్లు ఉంటుంది. బరువు 5,850 కిలోమీటర్లు. సాధారణ రైలు బండి కన్నా తక్కువ బరువే. డ్రైవర్‌తో కలిపి 23 మందిని తీసుకెళ్లగలదు. పట్టాలపై గంటకు 60 కిలోమీటర్లు, రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది పూర్తిగా డీజిల్‌తో నడిచే వాహనం. ఇలాంటి వాహనాలు ‘అసా’ దగ్గర మూడున్నాయి. ఈ డీఎంవీలను తిప్పే ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రణాళిక వేశారు. ఎంచక్కా సముద్రతీరాన్ని చూస్తూ ముందుకు సాగిపోవచ్చు. డీఎంవీ వెళ్లే మార్గ మధ్యలో షిషికుయ్ వేడి నీటి బుగ్గలు వస్తాయి. అక్కడ పర్యాటకులు ఆగి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. చిన్న చిన్న బీచ్‌లు, కైయో లాంటి చిన్న చిన్న పట్టణాలూ ఈ మార్గంలో ఎదురవుతాయి. కైయో లాంటి పట్టణాల్లో జనాభా తగ్గిపోతోందని, ఇలాంటి పట్టణాలకు మళ్లీ కళ తెచ్చేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయని అసా కోస్టల్ రైల్వే కంపెనీ సీఈవో చెప్పారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Is it a bus or a train? The first 'dual-mode vehicle' is unveiled in Japan https://t.co/CPP2fGb0fL pic.twitter.com/fSARkvv5Ww
— Reuters (@Reuters) December 26, 2021
Comments
Please login to add a commentAdd a comment