
స్టాక్స్ వ్యూ
హిందాల్కో..
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్
ప్రస్తుత ధర: రూ.146 టార్గెట్ ధర: రూ.190
పుస్తక విలువ: రూ.187 ముఖ విలువ: రూ.1 ఈపీఎస్: రూ.4 ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.59/152
ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం క్షీణించినా, అధిక పన్ను వ్యయాలు ఉన్నప్పటికీ, నికర లాభం(స్టాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఐదు రెట్లు వృద్ధి చెంది రూ. 294 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి నిలకడగా ఉండటం, ఇంధన ధరలు తక్కువగా ఉండటంతో వ్యయ ప్రయోజనాల కారణంగా ఇబిటా అంచనాలను మించి 1,130 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇబిటా రూ.12,400 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నాం. కంపెనీ అనుబంధ సంస్థ నొవాలిస్ కూడా మంచి ఆర్థిక ఫలితాలనే సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హిందాల్కో కంపెనీ రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు పటిష్టమైన ఇబిటా తోడుకానుండటంతో కంపెనీకి రూ.2,500 కోట్ల మేర ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.
ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర రుణ భారం 2,500-3,000కోట్ల రేంజ్‌లో తగ్గవచ్చు. ఇటీవల జరిగిన వేలంలో 4.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తక్కువ ధరలకే దక్కించుకున్నది. ఈ బొగ్గు సరఫరాలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి. దీంతో బొగ్గు వ్యయాలు మరింతగా తగ్గుతాయి. నిర్వహణ అంశాల పరంగా రాగి ఉత్పత్తిని 53 రోజుల పాటు నిలిపేసింది. ఫలితంగా ఈ క్యూ1లో రాగి విభాగం లాభదాయకత తగ్గింది. ఉత్పత్తి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానుండటంతో ఈ విభాగం మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. వడ్డీరేట్లు తగ్గుతుండటంతో వడ్డీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వస్తోన్న అల్యూమినియం దిగుమతులపై యాంటీ డంపింగ్ లేదా కనీస దిగుమతి ధర విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కంపెనీకి కలసివచ్చే అంశం.
లుపిన్..
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.1,579 టార్గెట్ ధర: రూ.1,890
పుస్తక విలువ: రూ.244 ముఖ విలువ: రూ.2 ఈపీఎస్: రూ.57
ఏడాది కనిష్టం/గరిష్టం: రూ.1,274/2,127
ఎందుకంటే: జనరిక్ ఔషధాలు ఎగుమతి చేసే అతి పెద్ద భారత కంపెనీల్లో లుపిన్ ఒకటి. స్థూల మార్జిన్లు పటిష్టంగా ఉండటం, అమెరికా వృద్ధి జోరుగా ఉండటంతో లుపిన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో 43 శాతంగా ఉన్న అమెరికా అమ్మకాలు 84 శాతం పెరగడంతో ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.4,439 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 333 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 30 శాతానికి, ఇబిటా 59 శాతం వృద్ధితో రూ.1,308 కోట్లకు పెరిగాయి. నికరలాభం 55 శాతం పెరిగి రూ.882 కోట్లకు పెరిగింది. పరిశోధన. అభివృద్ధికి అధికంగా పెట్టుబడులు సమకూర్చుకోవడం, అమెరికా, జపాన్‌ల్లో ఔషధాల ధరల నిర్ణయంపై ఒత్తిడి మార్జిన్లపై ప్రభావం చూపుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులు, కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేవడం తదితర అంశాల కారణంగా ఈ ఒత్తిడిని అధిగమిస్తామని కంపెనీ ధీమాగా ఉంది. ఇటీవలనే అమెరికాకు చెందిన గావిస్ ఫార్మా కొనుగోలును పూర్తి చేసింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం ప్రతి ఏటా దాఖలు చేసే కొత్త ఔషధాల ప్రతిపాదనలు 20 నుంచి 45కు పెరగనున్నాయి. వీటిల్లో ఏటా కనీసం 15 ప్రతిపాదనలకు ఆమోదం లభించగలదని కంపెనీ భావిస్తోంది. గత పదేళ్లలో ఆదాయం 24%, ఇబిటా 29 శాతం, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. రెండేళ్లలో అమెరికా అమ్మకాలు 26%, భారత విక్రయాలు 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. 2016-18 కాలానికి ఆదాయం 20%, ఇబిటా 21%, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం, పటిష్టమైన బ్యాలెన్స్ షీట్.. కంపెనీ బలాలు. రష్యా ప్రభుత్వ షరతుల కారణంగా బయోకామ్ కొనుగోలులో జాప్యం కానుండటం ప్రతికూలమైన అంశం.