మళ్లీ గడువు కోరిన విజయ్ మాల్యా
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ముందు హాజరు కావడానికి గడువుల మీద గడువు కోరుతూ వస్తున్న విజయ్ మల్యా మళ్లీ మరింత సమయం కావాలంటూ ఈడీని కోరారు. ఇవాళ (శనివారం) హాజరుకాలేనని, మే నెలాఖరులో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఈడీకి సమాచారం అందించారు. 'రుణ ఎగవేతకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయని వాటి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని అందుకే తనకు మరింత గడువు కావాలని' కోరుతున్నట్టు పేర్కొన్నారు.
కాగా, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900కోట్లు రుణానికి సంబంధించి లోన్ ఫ్రాడ్ కేసులో మాల్యా పాత్రను ఈడీ విచారిస్తోంది. అయితే మనీ లాండరింగ్ కేసులో నిందితుడు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని, తనపై మోపిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని అంటున్నారు ఈడీ అధికారులు. మరి మాల్యా అభ్యర్ధనను ఈడీ అంగీకరిస్తుందా చూడాలి.