నా విదేశీ ఆస్తులు బ్యాంకులకెందుకు..
♦ వాటి గురించి అడిగే అధికారం బ్యాంకులకు లేదు
♦ రుణ ఎగవేత కేసుల్లో సుప్రీంకోర్టులో మాల్యా వాదనలు
న్యూఢిల్లీ: తన విదేశీ ఆస్తుల గురించి సమాచారం అడిగే అధికారం బ్యాంకులకు లేదని రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను, తన భార్య, ముగ్గురు సంతానం కూడా ప్రవాస భారతీయులు (ఎన్నారై) అయినందున తమ విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మాల్యా తరఫు లాయరు అత్యున్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. దాదాపు 17 బ్యాంకులకు సుమారు రూ. 9,000 కోట్ల మేర రుణాల ఎగవేత కేసు ఎదుర్కొంటున్న మాల్యా దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే ఏప్రిల్ 21లోగా తన కుటుంబానికి దేశ, విదేశాల్లో ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు వెల్లడి ంచాలని, విచారణకు ఎప్పుడు హాజరవుతారో కూడా తెలపాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిన కేసులో మాల్యాను నిందితుడిగా ఒక స్థానిక కోర్టు నిర్ధారించింది. అయితే విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో శిక్షపై ఉత్తర్వులు ఇవ్వలేదు. మే 5న తీర్పు రావచ్చని భావిస్తున్నట్లు జీఎంఆర్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. అటు రూ. 900 కోట్ల ఐడీబీఐ బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాను స్వదేశానికి రప్పించే (డిపోర్టేషన్) ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కోరింది. ఆయనపై నాన్-బెయిలబుల్ వారంటు జారీ అయిన నేపథ్యంలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్) వచ్చేలా సీబీఐకి కూడా త్వరలోనే ఈడీ రాయనుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రుణంలో మాల్యా రూ. 430 కోట్లను మళ్లించి, విదేశాల్లో ఆస్తులు కొనుక్కునేందుకు ఉపయోగించుకున్నారన్నది ఈడీ వాదన.
డీల్ డీఆర్‌టీ పరిధిలోకి రాదు: డియాజియో
75 మిలియన్ డాలర్ల ప్యాకేజీలో భాగంగా మాల్యాకి ఇవ్వాల్సిన మిగతా 40 మిలియన్ డాలర్లను తమ వద్ద జమ చేయాలంటూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశించడాన్ని డియాజియో సవాల్ చేసింది. ఈ మొత్తం చెల్లింపు భారత్ వెలుపల జరుగుతున్నందున ఈ డీల్ డీఆర్‌టీ పరిధిలోకి రాదని పేర్కొంది. సదరు నిధులను అటాచ్ చేసుకునే అధికారం డీఆర్‌టీకి ఉండదంటూ ట్రిబ్యునల్ ముందు డియాజియో తన వాదనలు వినిపించింది. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్నందుకు గాను మాల్యాకు డియాజియో 75 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.