మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : బ్యాంకులకు కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, తప్పించుకున్న తిరుగుతున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు విజయ్ మాల్యాను ఆదేశించింది.
మాల్యా విదేశీ ఆస్తులతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆస్తుల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయొద్దని, ఈ వివరాలను గడువులోగా బ్యాంకులకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పాటుగా విజయ్ మాల్యా భార్య, పిల్లల ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ కోరిన పిటిషన్ తిరస్కరించింది. మరోవైపు ఈ ఆదేశాలను విజయ్ మాల్యాపై ఎలాంటి క్రిమినల్ చర్యలకు వాడుకోకూడదని అతని తరఫున లాయర్ సీఎస్ వైద్యనాథన్ సుప్రీంను కోరారు.