
హైదరాబాద్, గోవాలకూ విస్తారా విమానాలు
టాటా గ్రూపు ప్రారంభించిన విస్తారా విమాన సర్వీసుల సేవలు త్వరలోనే హైదరాబాద్, గోవా ప్రాంత వాసులకూ అందుబాటులోకి రానున్నాయి. విమానాల సంఖ్యను కూడా విస్తారా పెంచుతోంది. ఫిబ్రవరి 20 నుంచి గోవా, మార్చి 1 నుంచి హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని విస్తారా తెలిపింది.
తొలుత కేవలం వారానికి 68 విమానాలతోనే ఆపరేషన్లు ప్రారంభించిన ఈ సంస్థ.. మార్చి నాటికి వారానికి 164 విమానాలు నడపనుంది. ప్రారంభం నుంచే తమకు మంచి ఆదరణ లభిస్తోందని, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-గోవా విమానాలను ప్రారంభిస్తున్నామని విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫీ టీక్ యో తెలిపారు. ఈ రెండు నగరాలకు ప్రయాణికులు బాగా తిరుగుతారని, కొత్త విమానాల రాకతో దేశీయ విమానయాన రంగంలో తాము పటిష్ఠమైన స్థానంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.