
పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ
సాక్షి,విశాఖపట్నం: కేంద్రప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ లభిస్తే రాష్ట్రంతోపాటు విశాఖకు భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయని కెనడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వైజాగ్ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కష్ణబాబు పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏపీ-కెనడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్’ సదస్సులో పాల్గొన్న ఆయన కెనడా ప్రతినిధులకు రాష్ట్ర పారిశ్రామికరంగం అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు.
విభజన తర్వాత ఏపీలో సుదీర్ఘతీరప్రాంతం ఆధారంగా ప్రభుత్వం భారీస్థాయి అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఓడరేవు అధారిత పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం కల్పించడం ద్వారా మరింత ప్రగతి సాధించడానికి వీలుంటుందని చెప్పారు. భావనపాడుతోపాటు కాకినాడలోనూ కొత్త పోర్టులు వస్తున్నాయని, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లు కాకినాడ,విశాఖలోని గంగవరం పోర్టులోను రావడం ద్వారా పరిశ్రమలకు కావలసినంత ఇంధనం భవిష్యత్తులో నిరంతరం అందేఅవకాశం ఏర్పడుతుందన్నారు.
కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా,స్పెషల్ ప్యాకేజీ అమలైతే ఉత్తరాంధ్రలో ఎన్నడూ ఊహించని పారిశ్రామికపెట్టుబడులు తరలిరానున్నట్లు విశ్లేషించారు. పైగా ఉత్తరాంధ్రలో నాణ్యత కలిగిన మావనవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్‌పైపులైన్ నిర్మాణానికి ఆమోదం లభించడం తో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయన్నారు. పారిశ్రామికరంగానికి అనువైన వాతావరణంపై కెనడా ప్రతినిధులకు కూలంకుషంగా పలు అంశాలను వివరించారు.
వైజాగ్ నుంచి చెన్నైకు ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి సంబందించి ప్రస్తుతం చురుగ్గా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అధ్యయనం చేస్తోందని, రానున్న ఏడాదిలోగా పూర్తిస్థాయిలో మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతుందని తెలిపారు. జలరవాణాతోపాటు రైలురవాణాకు సంబంధించి విశాఖ,ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతికి,పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. అరూప్‌దత్తా ఆర్కిటెక్ట్ లిమిటెడ్ కంపెనీ స్మార్ట్‌సిటీల నిర్మాణంలో తమకున్న అనుభవాలను వివరించగా, బాంబేర్ డైర్,వోర్లీ పేర్‌సన్స్,క్లియర్‌ఫోర్డ్ ఇండస్ట్రీస్,లీ ఇంటర్నేషనల్ లిమిటెడ్,ఐబీఐ తదితర కెనడా కంపెనీల ప్రతినిధులు భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాల గురించి వివరించారు.