
ఆంధ్రప్రదేశ్‌లో వొడాఫోన్ 3జీ రోమింగ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 3జీ రోమింగ్ సేవలను అందిస్తున్నట్టు ప్రకటించింది. 3జీ రోమింగ్ ఒప్పందాలపై టెలికం శాఖ(డాట్) విధించిన నిషేధం చెల్లదని టెలికం వివాదాల పరిష్కారాల ప్రత్యేక న్యాయస్థానం(టీడీశాట్) ఏప్రిల్ 29న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 3జీ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో వొడాఫోన్ పునరుద్ధరించింది.
ఇక నుంచి కంపెనీ కొత్త కస్టమర్లను చేర్చుకుంటుంది. గతేడాది ఏప్రిల్‌లో డాట్ ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 3జీ ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను వొడాఫోన్ నిలిపివేసింది. పాత కస్టమర్లకు మటుకు సేవలను కొనసాగించేందుకు డాట్ వెసులుబాటు కల్పించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని వీలే ్లదని తేల్చి చెప్పింది. వొడాఫోన్‌కు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో సుమారు 2.5 లక్షల మంది 3జీ కస్టమర్లు ఉన్నారు.
మంచి వృద్ధి ఆశిస్తున్నాం..
3జీ విభాగంలో గణనీయ వృద్ధి ఆశిస్తున్నట్టు వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ మన్‌దీప్ సింగ్ భాటియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పోస్ట్ పెయిడ్ విభాగంలో నెలవారీ అద్దె రూ.150 నుంచి ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. 500 ఎంబీ నుంచి 8 జీబీ వరకు డేటా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రిపెయిడ్ విభాగంలో రూ.43 నుంచి రూ.650 వరకు ప్యాక్‌లు ఉన్నాయని, 150 ఎంబీ నుంచి 5 జీబీ వరకు డాటా ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. 2జీ కస్టమర్లు అత్యధికులు 3జీకి అప్‌గ్రేడ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐడియా సహకారంతో వొడాఫోన్ సేవలందిస్తోంది.