న్యూయార్క్: పరిశ్రమలు, సంస్థలు, వాటిని నడిపించేవారికి వేచి చూసేందుకు తగినంత సమయం లేదని, ఐటీ రంగం ఆధునికీకరణ సంతరించుకోవడానికి ముందే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం కావాలని నాస్కామ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సూచించారు. ఆధునికీకరణ అంటే అది కేవలం ఆర్టి ఫీషియల్ టెక్నాలజీ, బ్లాక్ చెయిన్ తరహా టెక్నాలజీలకే పరిమితం కాదని, యాజమాన్యం, నైపుణ్యాల మార్పూ అవసరమేనన్నారు. మారే టెక్నాలజీ తీరుతెన్నులే ఆధునికీకరణను నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా నడుచుకోవడమే మన ఎంపికగా పేర్కొన్నారు.
ఈ రోజు ఇదే నాయకత్వ సవాలుగా అభివర్ణించారు. అమెరికాలో జరిగిన నాస్కామ్ ఈ సమ్మిట్‌లో ప్రేమ్‌జీ పాల్గొని మాట్లాడారు. పరిశ్రమకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు, అనలిస్ట్‌లు, కంపనీల అధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నవి పనిని, కస్టమర్ల అనుభవాన్ని ఏ విధంగా మార్చేస్తున్నాయన్న అంశంపై చర్చ జరిగింది.
డిజిటైజేషన్ అన్నది ఇంకా చాలా ముందస్తు దశలోనే ఉందని, ఈ విషయంలో కంపెనీలు, పరిశ్రమలు మరింత పరిపూర్ణత సాధించాల్సి ఉందని రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. డేటా, టెక్నాలజీ ప్రయోజనాలను, కస్టమర్ల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంటే వృద్ధి చెందేందుకు అవకాశాలు అపరిమితమని సూచించారు. రిషద్ ప్రేమ్‌జీ విప్రో కంపెనీ బోర్డు మెంబర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు.
వాస్తవాలను చూడాలి...
హెచ్1బీ వర్క్ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఐటీ ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొనడంతో దీనిపై రిషద్ ప్రేమ్‌జీ స్పందిస్తూ... వాస్తవం నుంచి మనోభావాన్ని వేరు చేసి చూడాలన్నారు. ‘‘ఏటా 65,000 హెచ్1బీ వీసాలను జారీ చేస్తున్నారు. ఇందులో భారత ఐటీ రంగం 10,000లోపే వాడుకుంటోంది. 70 శాతం వీసాలు భారతీయులకే వెళుతున్నాగానీ, అవి భారత కంపెనీలకు కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన అభినందించాల్సిన అంశం.
అమెరికాలో 2020 నాటికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌లో 24 లక్షల మంది నిపుణుల కొరత ఉంటుందని కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం కంప్యూటర్, ఐటీ అనుబంధ సేవల్లోనే ఉండనున్నాయి’’ అని ప్రేమ్‌జీ వివరించారు. అమెరికాలో టెక్నాలజీ రంగంలో 70 లక్షల మంది పనిచేస్తుంటే మనం కేవలం 10,000 మంది గురించి మాట్లాడుతున్నామని, సెంటిమెంట్‌ను పక్కన పెట్టి వాస్తవాన్ని చూడాలన్నారు.
చైనాలో రెండో ‘భారత ఐటీ కారిడార్’
బీజింగ్: చైనా సాఫ్ట్‌వేర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను భారత్ ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ రెండో ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. అతిపెద్ద చైనా మార్కెట్లో భారత కంపెనీలకు అవకాశాలు కల్పించేందుకు గాను గుయాంగ్ పట్టణంలో ‘డిజిటల్ కొల్లాబరేటివ్ అపార్చునిటీస్ ప్లాజా’ (సిడ్‌కాప్) పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
చైనా గుయాంగ్ మున్సిపల్ చీఫ్, నాస్కామ్ కలసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు భారత ఐటీ కంపెనీలు, చైనా కస్టమర్ల మధ్య జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో నాస్కామ్ చైనాలోని డాలియన్ పట్టణంలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం గమనార్హం.
50 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో డిజిటల్ పరిణామం వేగాన్ని సంతరించుకుందని, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా అనలైటిక్స్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని ఐడీసీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ విభాగాల్లో నైపుణ్యాల కొరత గణనీయంగా ఉందని, ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది. డేటా మేనేజ్‌మెంట్, అనలైటిక్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అన్నవి కీలకమైనవిగా మారతాయని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 29 లక్షల ఉద్యోగాలు, ఉత్తర అమెరికాలో 12 లక్షలు, లాటిన్ అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment