విమానయాన చార్జీలను నియంత్రించాలి
న్యూఢిల్లీ: విమాన ప్రయాణ చార్జీల్లో భారీ మార్పులు ఉంటున్న నేపథ్యంలో వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని విమానయానంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఇష్టారీతిగా చార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్‌లైన్స్.. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం చార్జీలను నియంత్రించేందుకు పారదర్శకమైన వ్యవస్థేమీ లేని నేపథ్యంలో పౌర విమానయాన శాఖ తక్షణమే నియంత్రణ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించింది.
తద్వారా చార్జీలు సముచిత శ్రేణిలో ఉండేలా చూడాలని తెలిపింది. 80 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి, మృతదేహాన్ని తీసుకెడుతున్న వారికి ఆఖరు నిమిషంలోనైనా సరే తగినన్ని సీట్లు, అందుబాటు చార్జీలో ఉంచాలని స్థాయీ సంఘం పేర్కొంది.