న్యూఢిల్లీ : వాట్సాప్ యూజర్లకు శుభవార్త...త్వరలోనే ఈ మెసెజింగ్ ఆప్‌తో గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ప్రకటించింది. కాలిఫోర్నియాలోని సాన్ జోస్‌లో జరిగిన ఎఫ్8 సమావేశం సందర్భంగా ఫేస్‌బుక్ కంపెనీ ఈ విషయాన్ని ఆమోదించినట్లు తెలిపింది. ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే, కానీ ఇంతవరకూ దీని గురించి ఎటువంటి అధికారిక సమచారాన్ని తెలియజేయలేదు. కానీ ఎఫ్8మావేశం అనంతరం త్వరలోనే వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్‌ను తన ఫోటో షేరింగ్ ఆప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరీక్షించింది. ఇది మంచి ఫలితాన్ని ఇస్తే త్వరలోనే ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం వాట్సాప్ ద్వారా వన్ టూ వన్ వాయిస్, వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను నెలకు దాదాపు 1.5 బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. అలానే ఫేస్‌బుక్ నూతనంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌ను 450 మిలియన్ల మంది యూజర్లు రోజూ వాడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాక యూజర్లు రోజుకు 2 బిలియన్ల నిమిషాల సమయాన్ని వాట్సాప్ వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ కోసం వాడుతున్నట్లు తెలిపింది. వాట్సాప్ ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను రోజుకు 200 మిలియన్ల మంది భారతీయ యూజర్లు వాడుతున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సపోర్టు చేసే ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ద్వారా బాంక్ అకౌంట్‌కి ప్రత్యక్షంగా ఫండ్స్ ట్రాన్సఫర్ చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment