
అసలు ఆర్‌బీఐకి, కేంద్రానికి వివాదం ఎక్కడ మొదలైంది? దీనికి కారణాలు చూస్తే... మొండిబాకీలతో కుదేలవుతున్న బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తోంది. ఈ కఠినమైన ఆంక్షల వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని ఆయా బ్యాంకులు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. దీంతో పాటు విద్యుత్ రంగంలో మొండి బాకీల విషయంలో నిబంధనలను కొంత సడలించాలని కేంద్రం కోరింది. ఈ రెండింటికీ ఆర్‌బీఐ ససేమిరా అనేసింది. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గిపోవడం, పేమెంట్ వాలెట్లకు సంబంధించి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటం తదితర అంశాలు కూడా ఆర్‌బీఐకి, కేంద్రానికి మధ్య విభేదాలను ఇతోధికంగా పెంచాయి.
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రతను బలహీనపరిస్తే పెను విపత్తు తప్పదంటూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవి ఇద్దరి మధ్యా విభేదాలను స్పష్టంగా బయటపెట్టాయి. ఆర్‌బీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్న అభిప్రాయాలు కూడా నెలకొన్నాయి. దీనికి ప్రతిగా... బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిచ్చేస్తుంటే ఆర్‌బీఐ కళ్లు మూసుకుని కూర్చుందని, ఈ రుణాలే ప్రస్తుతం భారీ మొండిబాకీలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు విభేదాలను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. నియంత్రణ సంస్థలు తోచింది చేసి చేతులు దులుపేసుకుంటాయని, పర్యవసానాలు రాజకీయ నేతలు ఎదుర్కొనాల్సి వస్తుందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించి ఉంటుందన్న వార్తలు వచ్చాయి.
రాజన్‌తో రాజుకుంది...
నిజానికి కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు రేగటం ఇది తొలిసారేమీ కాదు. వడ్డీ రేట్ల నుంచి లిక్విడిటీ, బ్యాంకింగ్ రంగ నిర్వహణ మొదలైన పలు కీలక అంశాలపై గతంలోనూ అభిప్రాయ భేదాలుండేవి. అయితే, అంతిమంగా ఇవన్నీ సామరస్యంగానే పరిష్కారమయ్యాయి. కానీ, కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించిందంటూ వస్తున్న వార్తలను చూస్తుంటే ఈ సారి మాత్రం విభేదాలు తారస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామని ఆర్థిక శాఖ ప్రకటించినప్పటికీ, సెక్షన్ 7ని ప్రయోగంపై మౌనం దాల్చటం ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోందని పేర్కొన్నాయి. ఉర్జిత్ పటేల్‌కి ముందు రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసినప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య మొండిబాకీల నిర్వహణ, పెద్ద నోట్ల రద్దు వంటి పలు అంశాలపై విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ ఆర్థిక, ఆర్థికేతర విధానాలను రాజన్ బాహాటంగానే విమర్శించేవారు. దీంతో సుబ్రమణియన్ స్వామి వంటి బీజేపీ ఎంపీలు సహా పలువురు నేతలు రాజన్‌పై విమర్శలు గుప్పించారు.
దువ్వూరికీ తప్పలేదు...
రఘురామ్ రాజన్ కన్నా ముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. దువ్వూరి హయాంలో కఠిన ద్రవ్య పరపతి విధానంపై అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం గుర్రుగా ఉండేవారు. వడ్డీ రేట్లను సడలించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ వర్గాల అభ్యర్థనలను దువ్వూరి పక్కనపెడుతుండటంతో అసహనానికి గురైన చిదంబరం ఒక దశలో.. రిజర్వ్ బ్యాంక్ సహకారం లేకుండా ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధన కోసం అవసరమైతే ఒంటరిపోరుకైనా సిద్ధమన్నారు. దీనిపై పదవీ విరమణ సమయంలో స్పందించిన దువ్వూరి.. ఏదో ఒకరోజు ఆర్‌బీఐ చేసిన మేలును చిదంబరం గుర్తు చేసుకుంటారని చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment