విండోస్ 10కు కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్స్
న్యూయార్క్ : ఎన్నో నెలల బీటా టెస్టింగ్ అనంతరం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, విజయవంతంగా కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్ లను విండోస్ 10 లో ప్రవేశపెట్టింది. అదేవిధంగా విండోస్ 10లో ఫోటో షేరింగ్ ఇన్ స్టాగ్రామ్ యాప్ ను కూడా అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ యాప్ లను కేవలం విండోస్ 10 డెస్క్ టాప్ పైనే ప్రవేశపెట్టింది. విండోస్ 10 మొబైల్ ఫోన్లకు ఇవి సపోర్టు చేయవని ఫేస్ బుక్ పేర్కొంది. విండోస్ 10 ఫోన్లకి ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్సన్ లకు సమానంగా, అన్నీ రకాలైన ఫీచర్లతో (కామెంట్లకు ప్రతిస్పందనలు తెలపడం, స్టికర్లను యాడ్ చేసుకోవడం, ఈవెంట్ రిమైండర్లు, బర్త్ డేలకు కాలమ్) విండోస్ 10 వినియోగదారుల ముందుకు ఈ యాప్ లను తీసుకొచ్చింది. యాజర్లు న్యూస్ ఫీడ్ కు ఆర్టికల్స్ ను షేర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఈ యాప్ ఉంటుందని కంపెనీ చెప్పింది.
కానీ లైవ్ వీడియో బ్రాండ్ కాస్టింగ్ కు మాత్రం ఇది సపోర్టు చేయదని, త్వరలో దాన్ని కూడా ప్రవేశపెడతామని తెలిపింది. ఫేస్ బుక్ యాప్ మాదిరిగానే మెసెంజర్ యాప్ కూడా అన్నింటికీ వీలుగా ఉంటుందని పేర్కొంది. ఫోటోలు, వీడియోలు, చెల్లింపులు, వీడియో, వాయిస్ కాలింగ్ లకు మాత్రం మెసెంజర్ యాప్ ఇప్పట్లో సపోర్టు చేయదని, కొద్ది కాలం అనంతరం దాన్ని అప్ డేట్ చేస్తామని ఫేస్ బుక్ వెల్లడించింది.