
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థికంగా విస్మరించరాని సంవత్సరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిందని, ప్రపంచ బ్యాంక్ రూపొందించిన వ్యాపారం సులభతర నిర్వహణలో మంచి ర్యాంక్ పొందామని, మూడీస్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను పెంచిం దని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రాథమిక లక్ష్యంగా ఏడవ వేతన సంఘ సిఫారసులను ఆమోదించామని, ఫలితంగా 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.
13 ఏళ్ల తర్వాత రేటింగ్ పెంపు: దాదాపు 13 ఏళ్ల విరామానంతరం మూడీస్ రేటింగ్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను పెంచిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఇక ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికలో వ్యాపారం సులభతర నిర్వహణలో 30 స్థానాలు ఎగబాకామని పేర్కొంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సత్ఫలితాలు కనిపించడం మొదలైందని వివరించింది. వివిధ కేంద్ర, రాష్ట్ర్ట ప్రభుత్వాల పరోక్ష పన్నులన్నింటినీ తొలగించి ఒకే దేశం.. ఒకే పన్ను వ్యవస్థగా జీఎస్‌టీని అమల్లోకి తెచ్చామని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్ తేనున్నామని వివరించింది. ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)ని ఏర్పాటు చేసిందని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ)ని రద్దు చేశామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment