
మృతురాలు పల్లా వెంకటనర్సమ్మ
చల్లగుండ్ల(నకరికల్లు) : పిల్లల స్కూల్ ఫీజు దగ్గర జరిగిన ఘర్షణలో ఓ వివాహిత భర్త ధాష్టీకానికి బలైపోయింది. ఈ దుర్ఘటన మండలంలోని చల్లగుండ్లలో బుధవారం చోటు చేసుంది. మాచర్ల మండలం గన్నవరానికి చెందిన పల్లా వెంకటనర్సమ్మ(29)కు, నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన పల్లా నాగరాజుతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. నర్సమ్మ నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో నర్స్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ముగ్గురు పిల్లలున్నారు. నాగరాజు మద్యానికి బానిస కావడంతో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి.
బుధవారం పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు భర్తకు డబ్బులివ్వగా మొత్తం కట్టకుండా అందులో కొంత నగదుతో మద్యం తాగాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఈ గొడవలో నాగరాజు భార్యను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందింది. విషయం తెలుసుకొని మృతురాలి బంధువులు పెద్దసంఖ్యలో చల్లగుండ్లకు చేరుకున్నారు. తల్లి పట్టెం రోశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బి.ప్రభాకర్, ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఘటనకు దారితీసిన కారణాలు వాకబు చేశారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment