శివరంజని ఆమె పిల్లలు (ఫైల్)
సాక్షి, చెన్నై : భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు ఇద్దరు పిల్లలను బలికొన్నాయి. ఈ సంఘటన శుక్రవారం తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపూరు జిల్లా పూమలూరుకు చెందిన శివరంజని అనే మహిళకు భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా భర్త ఆమెను కొట్టడంతో మనోవేదనకు గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా ఆరు నెలల కుమార్తెను, ఏడు సంవత్సరాల కుమారున్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసింది.
నీటిలో ఊపిరాడక పిల్లలిద్దరూ చనిపోయారని ధ్రువీకరించుకున్న శివరంజని వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలుతున్న ఆమె గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పి కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివరంజని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తల నడుమ గొడవ ఇద్దరు చిన్నారులను బలి కొనటం తిరుపూరు జిల్లాలో కలకలం సృష్టించటమే కాకుండా విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment