సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అయితే, టెన్త్ ఫలితాలు ఓ కుటుంబంలో తీరని దుఃఖం నింపాయి. పాస్ అయిన ఆనందంలో కూల్‌డ్రింక్ కొనుక్కుందామని రోడ్డుపైకి వచ్చిన తిరుగుపల్లి రుక్మిణి (15) అనే విద్యార్థిని ప్రమాదానికి గురైంది. టాటాఏస్-మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తోడుగా వచ్చిన ఆమె చెల్లెలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(చదవండి :ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల)
ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.88 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్ 17 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment