దివ్య సందేశంపై రాక్షస కృత్యం! | 215 people died In Easter Terrost Blasts Across Sri Lanka | Sakshi
Sakshi News home page

దివ్య సందేశంపై రాక్షస కృత్యం!

Published Mon, Apr 22 2019 1:58 AM | Last Updated on Mon, Apr 22 2019 5:12 AM

215 people died In Easter Terrost Blasts Across Sri Lanka - Sakshi

కొలంబో: ద్వీపదేశం శ్రీలంక నెత్తురోడింది. క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్‌ పండుగనాడు నరహంతకులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీ యులు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ధ్రువీకరించారు. లక్ష్మి, నారాయణ్‌ చంద్రశేఖర్, రమేశ్‌ అనే ముగ్గురు భారతీయులు మరణించారనీ, వీరి గురించిన అధిక వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ తెలిపారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నా మని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్‌ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను పోప్‌ ఫ్రాన్సిస్‌ తీవ్రంగా ఖండించారు. వాటికన్‌ సిటీలో ఇచ్చిన సందేశంలో ఈ ఘటనను దారుణ హింసగా అభివర్ణించారు.   
ఆదివారం ఉత్తర కొలంబోలోని సెయింట్‌ సెబాస్టియన్స్‌ చర్చిలో ప్రార్ధనల సమయంలో చోటుచేసుకున్న భారీ పేలుడుతో బీతావాహ దృశ్యం.. 

దశాబ్దం తర్వాత మళ్లీ విధ్వంసం 
ఎల్‌టీటీఈ (లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలమ్‌)తో అంతర్యుద్ధం ముగిశాక గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో తాజా పేలుళ్లు మళ్లీ రక్తపాతాన్ని సృష్టించాయి. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారితోపాటు, శ్రీలంకకు వచ్చి విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంథోని చర్చి, నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవాలోని జియోన్‌ చర్చిలో ముందుగా ఉదయం 8.45 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ప్రజలు ప్రశాంతంగాప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుళ్లు జరిగాయని పోలీస్‌ శాఖ అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర చెప్పారు. పేలుళ్లలో విదేశీయులైన ఇద్దరు చైనీయులు, పోలండ్, డెన్మా ర్క్, జపాన్, పాకిస్తాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు కూడా మృతి చెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలంబో లోని ఐదు నక్షత్రాల హోటళ్లైన షాంగ్రీలా, సినమన్‌ గ్రాండ్, కింగ్స్‌బరిల్లోనూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికిపాల్పడింది తామేనని ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. శ్రీలంకలో గతంలో ఎల్‌టీటీఈ భయానక దాడులకు పాల్పడేది. శ్రీలంక నుంచి విడదీసి తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎల్‌టీటీఈ దాదాపు మూడు దశాబ్దాలు పోరాడింది. చివరకు 2009తో ఎల్‌టీటీఈ అధ్యక్షుడు వేళుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక ఆర్మీ మట్టుబెట్టడంతో ఇక ఆ సంస్థ అంతరించిపోయింది.

ఆత్మాహుతి దాడులేనని చెప్పలేం.. 
ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు దాడులూ ఆత్మాహుతి దాడులేనని చెప్పడానికి పోలీసుల వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవనీ, అయితే నెగొంబో చర్చిలో పేలుడు తీరును పరిశీలిస్తే అది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని గుణశేఖర చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ సినమన్‌ గ్రాండ్‌ హోటల్‌ లోని రెస్టారెంట్‌ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించారు. కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో 66 మృతదేహాలను ఉంచామనీ, గాయపడిన 260 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నామని గుణశేఖర తెలిపారు. అలాగే నెగొంబో లోని మరో వైద్యశాలలో 104 మృతదేహాలు ఉండగా, 100 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనుమానంపై ఏడుగురిని అరెస్టు చేశా మని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్‌ విజెవర్ధనే తెలిపారు. ఈ ఎనిమిది దాడులనూ ఒకే సంస్థ చేసిందని తాము భావిస్తున్నామన్నారు. దాడుల్లో మొత్తం 27 మంది విదేశీయులు చనిపోయారని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి రవీంద్ర అరియసింఘె వెల్లడించారు. గాయపడిన విదేశీయుల్లో భారత్‌తోపాటు అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారని మీడియా తెలిపింది. రాజధాని కొలంబోలోని జూ వద్ద జరిగిన మరో పేలుడులో ఇద్దరు మరణించారు. కొలంబో శివార్లలోని ఓ ఇంట్లో సోదాలు జరిపేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది చనిపోయారు.  

ముందే హెచ్చరించినా.. 
శ్రీలంకలో త్వరలో ప్రధాన చర్చిలు లక్ష్యంగా బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ పోలీస్‌ చీఫ్‌ 10 రోజుల ముందుగానే హెచ్చరించారు. ఏప్రిల్‌ 11నే ఆయన నిఘా హెచ్చరికలను ఉన్నతాధికారులకు పంపారు. ‘నేషనల్‌ తోహీత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే సంస్థ చర్చిలు, కొలంబోని భారత దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఓ విదేశీ నిఘా సంస్థ నుంచి సమాచారం అం దింది’అని పోలీస్‌ చీఫ్‌ పుజుత్‌ జయసుందర ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. అయినా శ్రీలంక పోలీసులు దాడులను ఆపలేకపోయారు. ముస్లిం సంస్థ అయిన ఎన్‌టీజే గతేడాది బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడంతో దాని పేరు వెలుగులోకి వచ్చింది.  
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని విక్రమసింఘే 

నిరవధిక కర్ఫ్యూ విధింపు
ఎనిమిదో పేలుడు సంభవించిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందంది. ప్రజలు శాంతిని పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ‘ఈ అనూహ్య పరిణామాల వల్ల నేను విస్మయానికి గురయ్యాను. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను కోరాం’అని ఆయన చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘె మాట్లాడుతూ ఇవి పిరికిపందలు చేసిన దాడులనీ, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని కోరారు. సెలవులో ఉన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, వైద్యాధికారుల అందరి సెలవులను రద్దు చేసి తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాలతోపాటు బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచారు. తాత్కాలికంగా అన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. పాఠశాలలను సోమ, మంగళవారాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నిరవధికంగా మూసివేశారు. కొలంబో జిల్లాలో ఈస్టర్‌ ప్రార్థనలను రద్దు చేస్తున్నట్లు కార్డినల్‌ (క్రైస్తవ మతంలో ఓ పదవి) మాల్కొమ్‌ రంజిత్‌ చెప్పారు. ఎల్‌టీటీఈని అణచివేసిన నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స మాట్లాడుతూ ఇది ఆటవిక దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక, ఉగ్రవాద, పిరికిపందల చర్యలను తాము సహించబోమనీ, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. 

ఎన్‌టీజే..హింసామార్గం 
శ్రీలంకలో చర్చిలపై నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టీజే) దాడులు చేసే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని 10రోజుల క్రితమే హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. అయితే ఈ హెచ్చరికల్ని శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ముస్లిం అతివాదులు సభ్యులుగా ఉన్న ఎన్‌టీజే తొలి సారి 2013లో వెలుగులోకి వచ్చింది. 2013, జూన్‌లో ఎన్‌టీజే కార్యదర్శి అబ్దుల్‌ రెహ్మానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గౌతమబుద్ధుడు నరమాంస భక్షకుడనీ, బౌద్ధమతం నరమాంస భక్షణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బౌద్ధుల ఆరాధనా విధానంపై విమర్శలు చేశారు. దీంతో 2014 మార్చిలో శ్రీలంకలో బౌద్ధులు–ముస్లింల మధ్య హింస చెలరేగడంతో ప్రభుత్వం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజలను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను 2016లో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. 2018లో ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులు గౌతమబుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చా యి.వీరి వ్యవహారశైలి హద్దుదాటడంతో ఎన్‌టీజేపై నిషేధం విధించాలని పీస్‌ లివింగ్‌ ముస్లిమ్స్‌ ఇన్‌ శ్రీలంక(పీఎల్‌ఎంఎంఎస్‌ఎల్‌) డిమాండ్‌ చేసింది. కేవలం హిం సను ప్రోత్సహించడమే కాకుండా ఇస్లాంలో అతివాద వహాబీ భావజాలాన్ని ఎన్‌టీజే వ్యాప్తిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో 22 లక్షల మంది ప్రజలు ఉండగా వీరిలో బౌద్ధులు 70%, హిందువులు 12.5%, ముస్లింలు 10%, క్రైస్తవులు 7.5%ఉన్నారు.   

శ్రీలంకను వరుస బాంబు పేలుళ్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొలంబో బిషప్‌ దిలొరాజ్‌ కనగసబే భావోద్వేగంతో స్పందించారు. ‘30 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో సతమతమైన అనంతరం మన ప్రజలంతా కలసిమెలసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తమ–తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జీసస్‌ పునరుత్థానమైన రోజున తమ ప్రియమైనవారిని కోల్పోయి మనోవేదనను అనుభవిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. శ్రీలంక లాంటి దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, భగవంతుడిని ప్రార్థించాలని బిషప్‌ కనగసబే పిలుపునిచ్చారు. ‘ఈ దుర్ఘటనతో అల్లాడిపోతున్న ప్రతీఒక్కరి బాధను తగ్గించాలనీ, వారిపై దయ చూపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అలాగే విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రాణాలకు విలువ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు.  - కొలంబో బిషప్‌ భావోద్వేగ సందేశం

హెల్ప్‌లైన్లు ప్రకటించిన భారత హైకమిషన్‌
శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కొలంబోలోని భారత హైకమిషన్‌ తెలిపింది. బాంబు పేలుళ్లు, దాడులకు సంబంధించి ఎలాంటి సహాయం, సమాచారం, స్పష్టత కావాలన్నా భారతీయులు సంప్రదించవచ్చంటూ 5 హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. +94777902082, +94777903082, +94112422788, +94112422789, +94772234176 నంబర్లకు ఫోన్‌ చేసి భారతీయులు వివరాలు అడగొచ్చని హైకమిషన్‌ ట్విట్టర్‌లో తెలిపింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై శ్రీలంక ఆంక్షలు 
కొలంబో: వరుస బాంబు పేలుళ్లపై సోషల్‌ మీడియా లో విస్తృతమవుతున్న వదంతులను నిరోధించేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఆదివారం బ్లాక్‌ చేసింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వదంతులు చెలరేగుతుండటంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బాంబు పేలుళ్లపై భద్రతాదళాల విచారణ సాగుతోందని, విచారణ కొలిక్కి వచ్చేదాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతా యని ప్రకటించారు. ప్రజలు సహనంతో వ్యవహరిం చాలని, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ట్వీట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ కూడా బాంబు పేలుళ్లపై స్పందించేందుకు వీలుగా ఒక మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిందని సీఎన్‌ఎన్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేం దుకు, తమ వారిని గుర్తించేందుకు, పేలుళ్ల ప్రభావానికి గురైన సన్నిహితులను చేరుకునేందుకు వీలుగా ఈ టూల్‌ ఉపయోగపడుతుం దని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బాంబు పేలుళ్లకు అవకాశమున్న ప్రాంతాలలో గుంపులుగా ఉండవద్దని, ఆసుపత్రుల పరిసరాలకూ ప్రజలు రావొద్దని శ్రీలంక హోంశాఖ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. 

ఈస్టర్‌ రోజున జరిగిన ఉగ్ర దాడులు..
2017 ఈజిప్టు
2017 ఏప్రిల్‌ 9న ఈజిప్ట్‌లోని టాంట, అలెగ్జాండ్రియా నగరాల్లో ఈస్టర్‌ పండగ రోజు జరిపిన బాంబు దాడిలో 45 మంది మరణించారు. ఈ దాడి నుంచి కాప్టిక్‌ పోప్‌ తవడ్రోస్‌  ఐఐ క్షేమంగా బయటపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని డాయిష్‌ ప్రకటించింది. 

2016 పాకిస్తాన్‌
లాహోర్‌లోని ఓ పార్క్‌లో ఈస్టర్‌ వేడుకలను జరుపుకుంటున్న వారిపై బాంబు దాడి జరిగింది. చిన్న పిల్లలు సహా మొత్తం 75 మంది ప్రాణాలు విడిచారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తామే అని పాకిస్తానీ తాలిబన్‌ శాఖ జమత్‌–ఉల్‌–అహ్రార్‌ ప్రకటించుకుంది.

2012 నైజీరియా
ఉత్తర నైజీరియాలో సాం స్కృతిక, ఆర్థిక నగరమైన ఖడునాలో 2012 ఏప్రిల్‌ 8న చర్చి వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఇస్లామిక్‌ సంస్థ బొకొ హరమ్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.  

క్రిస్టియన్స్‌పై దాడులు..
2019 ఫిలిప్పీన్స్‌
ఫిలిప్పీన్స్‌లో ముస్లిం ప్రాబల్యం ఉన్న జోలో ప్రాంతంలోని ద్వీపకల్పంలో 2019 జనవరి 27న క్యాథలిక్‌లపై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడికి డాయిష్‌ బాధ్యత వహించింది. కానీ దాడికి పాల్పడింది అజంగ్‌–అజంగ్‌ సంస్థగా అధికారులు పేర్కొనారు.  

2017 ఈజిప్ట్‌
2017 మే 26న సెంట్రల్‌ మిన్య వద్ద సెయింట్‌ సామ్యూల్‌ ఆశ్రమానికి బస్సులో వెళ్తున్న కాప్టిక్‌ క్రిస్టియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడింది తామే అని డాయిష్‌ ప్రకటించుకుంది.  

2016 కైరో
చర్చిలో పార్థనలు చేస్తున్న కాప్టిక్‌ క్రిస్టియన్స్‌ లక్ష్యంగా 2016 డిసెంబర్‌ 11న జరిగిన ఆత్మాహుతి దాడిలో 29 మంది ప్రాణాలు వదిలారు. ఈ దాడికి సైతం డాయిష్‌ బాధ్యత వహించింది.

2016 యెమెన్‌
ఉగ్రవాదులు యెమెన్‌లోని అడెన్‌లో క్యాథలిక్‌ వృద్ధాశ్రమంపై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. మరణించిన వారిలో కోల్‌కతాలోని మిషనరీ ఆఫ్‌ చారిటీకి చెందిన నలుగురు నన్‌లు కూడా ఉన్నారు. డాయిష్‌ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 

2015 పాకిస్తాన్‌
2015 మార్చి 15న ఆదివారం రోజు లాహోర్‌లోని చర్చిల్లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనతో 17 మంది మృత్యువాత పడగా, 70 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామే అని తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement