నిమజ్జనంలో విషాదం | 3 People died In ganesh Immersion In Guntur | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో విషాదం

Published Mon, Sep 9 2019 11:46 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

3 People died In ganesh Immersion In Guntur - Sakshi

మృతి చెందిన భూక్యా చంటి,భూక్యా శంకర్,బాణావత్‌ గోపాలరావు

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. కొండూరు తండాలో విషాదం అలముకుంది. అప్పటి వరకు గణనాథుడి జయజయధ్వనులతో హోరెత్తిన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరి నిమిషం వరకు అందరితో సరదాగా.. హుషారుగా నృత్యాలు చేస్తూ గడిపిన ముగ్గురు యువకులను నిమజ్జన పర్వం ముగుస్తున్న సమయంలో చెరువులోని భారీ గోతులు కబళించేశాయి. తమ ఆశాజ్యోతులు జలసమాధి కావడంతో ఆ యువకుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో.. కూలి పనులు చేసుకుంటూ పిల్లల భవిష్యత్‌ కోసం శ్రమిస్తున్నామని.. తీరా చేతికి అంది వచ్చిన కుమారులను కోల్పోవడంతో తమ జీవితాలు శూన్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, ఎ.కొండూరు(కృష్ణా): మండలంలోని కొండూరు తండాలో గణేశ నిమజ్జన వేడుక మూడు కుటుంబాల్లో శోకాన్ని నింపింది. స్థానికులు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకల్లో పూజలందుకున్న గణనాథుడిని గ్రామశివారులోని చెరువులో నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదవశాత్తు తండాకు చెందిన బాణావతు గోపాలరావు(20), భూక్యా శంకర్‌(22), భూక్యా చంటి(22) చెరువులో తవ్విన లోతైన గోతుల్లో పడిపోయారు. యువకులను కాపాడేందుకు మిగిలినవారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ముగ్గురు యువకులు తమ కళ్లెదుటే ప్రాణాలు విడిచారని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మైలవరం సీఐ పి. శ్రీను, ఏకొండూరు ఎస్‌ఐ పీవీపీ కుమార్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. యువకుల మృతదేహాలను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబాలను తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించారు.

కన్నీళ్లకే కన్నీరొచ్చే..
తిరువూరు: ‘ఉన్న ఒక్కగానొక్క కొడుకు దేవుడి దగ్గరికెళ్లిపోయాడయ్యా.. ఇక మాకెవరు దిక్కయ్యా..’ ‘రేపో మాపో ఉద్యోగం వస్తే కుటుంబ సమస్యలు తీరతాయనుకున్నాం.  ఇంతలోనే దేవుడు మాకు అన్యాయం చేశాడయ్యా’ అంటూ విలపిస్తున్న కన్నవారి తీరు కలచివేస్తోంది. వినాయక చవితి పండుగ నాటి నుంచి నవరాత్రి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుని గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.  కొద్ది గంటల క్రితం వరకు ఆటపాటలతో అలరించిన కన్నబిడ్డలు విగతజీవులుగా మారడం వారికి కడుపుకోత మిగిల్చింది. ఒకేరోజు ముగ్గురు యువకులు చనిపోవడం ఏ కొండూరు తండా వాసుల్లో తీవ్ర విషాదం నింపింది. 

కన్నవారికి భారం కాకూడదని..
మృతుల్లో ఒకరైన భూక్యా చంటి ఐటీఐ పూర్తి చేసుకుని ఇటీవల ఆర్టీసీలో కాంట్రాక్టు డీజిల్‌ మెకానిక్‌ పోస్టుకు దరఖాస్తు చేయగా, సోమవారం ఎంపిక పరీక్షకు హాజరుకావలసి ఉంది. ఇతని తండ్రి బద్దు చిన్నతనంలోనే చనిపోగా, తల్లి సక్రీ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించుకుంది. మృతుడి తమ్ముడు భూక్యా వస్రం కూడా ప్రైవేటు పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరో యువకుడు భూక్యా శంకర్‌(22) డిగ్రీ చదివి ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష రాశాడు. తండ్రి భూక్యా సోములు, తల్లి అల్లు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బాణావాత్‌ గోపాలరావు(20) విస్సన్నపేట శ్రీశ్రీ విద్యాసంస్థల్లో బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి జయరాం, తల్లి బుజ్జి కూలీ పనులు చేస్తుంటారు. తమ ఏకైక కుమారుడు మృతి చెందిన సంఘటనను జీర్ణించుకోలేక పోతున్నారు. 

‘నీరు–చెట్టు’ గోతులు ప్రాణాలు తీస్తున్నాయి
ఎ.కొండూరు(తిరువూరు): గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో నీరు–చెట్టు పథకం కింద ఇష్టానుసారంగా తవ్విన గోతులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఎమ్మెల్యే రక్షణనిధి ధ్వజమెత్తారు. ఎ.కొండూరు తండాలో నిమజ్జనం సమయంలో ప్రమాదవాశాత్తు చెరువులో పడి మృతి చెందిన చంటి, శంకర్, గోపాలరావు మృతదేహాలను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించి నివాళులర్పించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా చెరువుల్లో తీసిన గోతుల వల్ల గతంలో పోలిశెట్టిపాడు చెరువులో ఇద్దరు ఇదే రీతిన మృతిచెందారన్నారు. అలాగే నందిగామ, మైలవరం ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న గోతుల్లో పడి యువకులు మృత్యువాతపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ దుర్మార్గ పాలన కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

రూ.5 లక్షలు ఆర్థిక సాయం
బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వైఎస్సార్‌ బీమా పథకం కింద ఒక్కొక్కొ కుటుంబానికి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బాధిత గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. మైలవరం సీఐ పి. శ్రీను, ఎ.కొండూరు ఎస్‌ఐ పీవీపీ కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడ్డి, తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు, వజ్రాల బ్రహ్మానందరెడ్డి, అలవాల సుబ్బారెడ్డి, బత్తుల వెంకయ్య, ఎం. ఉమ , కె. చెన్నారావు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement