కోల్‌కతా: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ క్రిష్ణబోస్(89) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘‘వయో సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. రెండోసారి స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించాం. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు’’అని క్రిష్టబోస్ తనయుడు సుమాంత్రా బోస్ తెలిపారు. కాగా 1930లో జన్మించిన క్రిష్ణబోస్.. కోల్‌కతాలోని సిటీ కాలేజీలో దాదాపు నలభై ఏళ్లపాటు లెక్చరర్‌గా పనిచేశారు. అదే కాలేజీలో ఎనిమిదేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువు శిశిర్ కుమార్ బోస్‌ను వివాహం చేసుకున్న ఆమె... 1996లో తొలిసారిగా లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాధవ్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. క్రిష్ణబోస్‌కు కుమారులు సుగతా బోస్, సుమంత్రా బోస్, కూతురు షర్మిల ఉన్నారు. కాగా అభిమానులు సందర్శనార్థం క్రిష్ణబోస్ భౌతిక కాయాన్ని తొలుత శరత్‌రోడ్డులోని ఆమె నివాసానికి తరలించారు. అక్కడి నుంచి నేతాజీ భవన్‌కు పార్థివదేహాన్ని తీసుకువెళ్లిన తర్వాత.. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీ భవన్‌లో క్రిష్ణబోస్‌కు నివాళులు అర్పించనున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున క్రిష్ణబోస్ నివాసానికి చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment