ఓర్వకల్ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరాల సంజీవరెడ్డి ఇంట్లో లభించిన ఆభరణాలు, నగదు, డాక్యుమెంట్లు
నూతన ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతిపరుల భరతం పడుతోంది. ఇటీవల ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరాల సంజీవరెడ్డి అక్రమాస్తుల గుట్టును రట్టు చేసిన ఏసీబీ..తాజాగా ఎంవీఐ శివప్రసాద్ ‘చిట్టా’ విప్పింది. అయితే..ఏసీబీ వలకు చిక్కకుండా తప్పించుకుంటున్న తిమింగలాలు మరెన్నో ఉన్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి తారస్థాయిలో కొనసాగింది. రూ.కోట్లను కూడబెట్టుకున్న అవినీతిపరులెందరో ఉన్నారు. ఏసీబీ ఫోకస్ పెట్టడంతో ప్రస్తుతం వీరిలో వణుకు మొదలైంది.
సాక్షి, కర్నూలు : దేవదాయ శాఖలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న రాంప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.3 కోట్లకు పైగానే ఉందని తనిఖీలో బయట పడింది.
⇔ పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ సత్య శ్రీనివాసుల ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. దాదాపు రూ. 2.50 కోట్లు అక్రమాస్తులు బయటపడ్డాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 5 కోట్లకు పైగానే పలుకుతున్నట్లు అధికారులు గుర్తించారు.
⇔ ఓర్వకల్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరాల సంజీవరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. సుమారు రూ. 5కోట్ల విలువ చేసే ఆస్తులు వెలికి తీశారు.
⇔ తాజాగా కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి(ఎంవీఐ)గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టగా కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 30 కోట్లకు పైగా వెల్లడైంది. ఆయన ఆస్తుల చిట్టాను చూసి విచారణ అధికారులకు కళ్లు బైర్లు కమ్మేశాయి. కిలోలకొద్ది బంగారుతోపాటు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇది పెద్ద సంచలనమైంది.
⇔ ఇలా చెప్పుకుంటూ పోతే దొరికిన తిమింగిలాలు ఎన్నో ఉన్నాయి. దొరకని అవినీతిపరులు కూడా మరెందరో ఉన్నారు. ఏదో ఒక రోజు వారిపై ఏసీబీ అధికారుల దాడులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇళ్లలో రూ. కోట్లు కూడబెట్టుతూ ‘పైసా’చికానందం పొందుతున్నారన్న విమర్శలున్నాయి.
అవినీతి సామ్రాట్లపై ‘ఫోకస్’:
అవినీతికి ఆస్కారం లేకుండా మెరుగైన సేవలందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నా అవినీతి అధికారులకు చెవికెక్కడం లేదు. ఎప్పటిలాగే జనాన్ని పీక్కు తినడమే తమ పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అక్రమంగా ఆస్తులు పోగేసిన తిమింగిలాలపై ఏసీబీ ‘ఫోకస్’ పెట్టింది. కరువు సీమగా పేరొందిన కర్నూలు జిల్లాలో అనేక మంది అవినీతి సామ్రాట్లు ఉన్నారు. ఇక్కడ లంచాల రూపంలో రూ. కోట్లు దండుకుని హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, విశాఖపట్టణం ప్రాంతాల్లో విలాసవంత భవనాలతోపాటు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి. వీరితో పాటు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన తిమింగిలాలు ప్రభుత్వ శాఖల్లో అనేకమంది ఉన్నట్లు ఆ శాఖ అధికారుల వద్ద చిట్టా కూడా ఉంది.
నీరు–చెట్టు పనులపై ఫిర్యాదులు
జలవనరుల పర్యవేక్షణలో గత ప్రభుత్వ హయాంలో నీరు– చెట్టు పనులు జరిగాయి. పనుల ప్రతిపాదనలు, అంచనాల తయారీ, పనుల మంజూరు, బిల్లుల చెల్లింపు వరకు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత ‘కుర్చీ’ వరకు పని విలువలో అప్పనంగా 15 నుంచి 20 శాతం వరకు లంచాల రూపంలో దండుకున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు చేరాయి. అలాగే పలు ఇంజినీరింగ్ విభాగాల్లో కూడా అప్పట్లో అవినీతి తారా స్థాయికి చేరినట్లు నివేదికలున్నాయి. రెవెన్యూ శాఖలో పట్టదారు పాసుపుస్తకం కావాలన్నా చేయి తడపాల్సిందే. అడిగినంత ఇవ్వకుంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ధ్రువీకరణ పత్రాలు, భూములు ఆ¯న్ లైన్‌లో మార్పులు చేయాలన్నా, వ్యవసాయ బోరు విద్యుత్ కనెక్షన్ కావాలన్నా కాసుల దాహం తీర్చాలి. విద్యుత్, రవాణా, పురపాలిక, పంచాయతీ రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ, మార్కెటింగ్, రోడ్లు భవనాల శాఖలోనూ తిమింగిలాల చిట్టా ఏసీబీ వద్ద ఫిర్యాదుల రూపంలో ఉన్నట్లు సమాచారం.
మాతృ సంస్థ పోలీసు శాఖలో కూడా అవినీతి రాజ్యమేలుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. గోస్పాడు మండల కేంద్రంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి గత నెల రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వారి అవినీతి చిట్టాపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. డీఎస్పీ నాగభూషణం కర్నూలుతో పాటు అనంతపురం, కడప జిల్లాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. రెండు మాసాల వ్యవధిలోనే మూడు జిల్లాల్లో 15 కేసులు నమోదు చేసి సుమారు రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఒకవైపు అవినీతి అధికారుల జాబితా సిద్ధం చేస్తూ సమయం వృథాకాకుండా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అవినీతి పరుల ఆటలు సాగనివ్వం
అవినీతి పరుల సమాచారం మాదృష్టికి ధైర్యంగా తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎంతటి స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. కొద్దిమంది మాత్రమే మాకు నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులతో మనకెందుకులే అనే భావన వీడండి. ఆమ్యామ్యాలు అడిగితే ఎందుకు ఇ వ్వాలని నిలదీయండి. ప్రజా చైతన్యం ద్వా రానే లంచగొండి అధికారుల తీరును మార్చడానికి వీలవుతుంది. ఎరవైనా లంచం అడిగితే సెల్: 94404 46178 నంబర్‌కు సమాచారం ఇవ్వండి.
– నాగభూషణం, ఏసీబీ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment