అవినీతి శంకరం | ACB Raids in Municipal Commissioner House Visakhapatnam | Sakshi
Sakshi News home page

అవినీతి శంకరం

Feb 21 2019 7:35 AM | Updated on Mar 20 2019 1:32 PM

ACB Raids in Municipal Commissioner House Visakhapatnam - Sakshi

శంకరరావును మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకొస్తున్న ఏసీబీ అధికారులు

బుధవారం ఉదయం 6.30 గంటలు.. నర్సీపట్నంలో మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకర్రావు బస చేసిన ప్రైవేట్‌ లాడ్జి.. ఏసీబీ అధికారులు తలుపు కొట్టారు.. నిద్ర కళ్లతో తలుపు తీసిన కమిషనర్‌ అవాక్కయ్యారు.. ఆయనను మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇలా.. విశాఖ ఎంవీపీ కాలనీలోని శంకరరావు ఇల్లు, మధురవాడలోని ఆస్తులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లు, ఆస్తులను.. మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ మార్కెట్‌ ధర ప్రకారం రూ.20కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు.

సీతమ్మధార (విశాఖ ఉత్తరం)/నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు.

శంకరరావును మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్‌కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్‌ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. 2008లో గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్‌గా నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్‌గా ఎంత చెల్లించారని లాడ్జి మేనేజర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు మేనేజర్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్‌కు టిఫిన్‌ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు.  అనంతరం ఏసీబీ సీఐ గణేష్‌ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్‌ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్‌ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్‌ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఎంవీపీ కాలనీలోని హనుమంతు శంకరరావు సొంత ఇల్లు
వుడా కాలనీలో సోదాలు
పీఎం పాలెం(భీమిలి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకరరావు ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మిథిలాపురి ఉడా కాలనీలో గల మూడంతుస్తుల భవనం మొదటి ఫ్లోర్‌లో శంకరరావు బంధువు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ ఇంటిలో సుమారు 5గంటలపాటు సోదాలు జరిపారు. పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు.

బొబ్బిలిలో..
బొబ్బిలి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ శంకరరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈనెల 14న బొబ్బిలి నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్‌ కమిషనర్‌ హెచ్‌.శంకరరావు జిల్లా కేంద్రంలోని పూల్‌బాగ్‌ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్నారు. ఆయన కుటుంబం జిల్లా కేంద్రంలోనే ఉండడంతో  ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ నాగేశ్వరరావు నేృతృత్వంలోని  సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. అయితే తనిఖీలకు కమిషనర్‌ భార్య ముందు ఒప్పుకోకపోగా.. డీఎస్పీ నాగేశ్వరరావు నచ్చజెప్పారు. తనిఖీల్లో కీలకమైన పత్రాలు సీజ్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు సతీష్, జి. అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.  

గుర్తించిన అక్రమాస్తులివీ...
విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, సెక్టార్‌ – 4లో 207 గజాల విస్తీర్ణంలోని ఇల్లు భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరున 2017లో కొనుగోలు చేశారు.
మధురువాడ వాంబేకాలనీలో 236 గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనం తండ్రి పేరున కొనుగోలు.
భీమిలి, సంగివలస, నేరెళ్లవలసలో 60 సెంట్ల భూమి కొనుగోలు చేశారు.
భీమిలి సమీప కుమ్మరిపాలెంలో భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరు మీద 266.6 గజాల స్థలం 2002లో కొనుగోలు చేశారు.
100 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు గుర్తించారు.
స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా చిట్టివలస, భీమిలి బ్రాంచిల్లోని లాకర్లలో రూ.5.20 లక్షల నగదు గుర్తించారు.
బొబ్బిలిలోని కరూర్‌ వైశ్య బ్యాంకులో రూ.2.50లక్షల విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు.
ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కలకలం
టెక్కలి/కాశీబుగ్గ: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. టెక్కలి గోపినాథపురంలో శంకరరావు తండ్రి నర్సింగరావు పేరుతో ఉన్న ఇంటికి ఉదయం 8 గంటలకే ఏసీబీ అధికారులు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి పక్కనే అద్దెకు ఉంటున్న వారి నుంచి వివరాలు తీసుకున్నారు. కమిషనర్‌ శంకరరావు అత్తామామలు కణితి సావిత్రి, సూర్యనారాయణలు పలాస మండలం బ్రాహ్మణతర్లాలో నివాసముంటున్నారు. సూర్యనారాయణ డ్రిల్‌మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు.

ఏసీబీ దాడుల నేపథ్యంలో విశాఖ ఏసీబీ సీఐ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఇంట్లో అణువణువూ శోధించారు. ఉదయం ఏడు గంటల నుంచి బీరువాలు, పెట్టెలు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌పుస్తకాలు, పలు వస్తువులు క్షుణ్నంగా పరిశీలించారు. శంకరరావు పెద్ద బావమరిది చక్రధర్‌ విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న బావమరిది భువనేశ్వర్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల నేపథ్యంలో చక్రధర్‌ విశాఖ నుంచి బ్రాహ్మణతర్లా చేరుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఏసీబీ సిబ్బంది రాము, మాధవరావు, కాశీబుగ్గ షీటీం పోలీసులు మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement