సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల క్రితం తమపై జరిగిన దాడికి నిరసనగా డాక్టర్లు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై భైఠాయించిన డాక్టర్లు.. సేవ్ డాక్టర్స్, సేవ్ లైవ్స్, సేవ్ మెడికల్ ప్రొఫెసనల్స్, సేవ్ హాస్పిటల్ స్టాఫ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వివరాలు ఇలా .. సంతోష్‌నగర్‌కు చెందిన షమీనా బేగం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్ అలీ ఖాన్, బర్కత్ అలీ ఖాన్, ముజఫర్ అలీ ఖాన్‌లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్ ట్రీట్‌మెంట్ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి నలుగురిపై సెక్షన్ 4..
హైదరాబాద్ : లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనపై సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ స్పందించారు. ఆస్పత్రిపై దాడి చేసిన నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా నలుగురిపై సెక్షన్ 4ను అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసులపై కూడా వారు దాడిచేసినట్లు వెల్లడించారు. ఐపీసీ 148, 324, 333, 427 రెడ్‌విత్ కింద కేసులు నమోదు చేశామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
సోషల్ మీడియాలో హోంమంత్రిపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. అరెస్టయిన నలుగురిని న్యాయ స్థానం ముందు ప్రవేశ పెట్టి, రిమాండ్ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment