సాక్షి, చెన్నై: కరోనా కట్టడి విధుల్లో ఉన్న కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఒకరు వలంటీరుగా సేవకు వచ్చిన ఓ కళాశాల విద్యార్థినిని ప్రేమ వలలో పడేయడానికి యత్నించాడు. విధుల్ని పక్కన పెట్టి ప్రేమ పాఠాలు వళ్లిస్తూ ఆడియో రూపంలో అడ్డంగా బుక్కైన ఈ అధికారిని సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.చెన్నై పరిధిలో కరోనా కట్టడి విధుల్లో మైక్రో టీం సేవలు అభినందనీయం. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య , రెవెన్యూ, పారిశుధ్య కార్మికులే కాదు, వలంటీర్లుగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు వార్డుల్లో బృందాలు సేవల్ని అందిస్తున్నారు. ఇంటింటా పరిశీలనతో జ్వరం బారిన పడ్డ వారిని గుర్తించడం, కరోనా బారిన పడి హోం క్వారంటైన్లలో ఉన్న కుటుంబాలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను దరి చేర్చడం, వైద్య సంబంధిత సేవలు అంటూ ఈ బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆదిశగా రాయపురం మండలం పరిధిలోని ప్రాంతాల్ని అసిస్టెంట్ ఇంజివనీర్ కమల కన్నన్ పర్యవేక్షిస్తున్నారు. మన్నడిలో వలంటీర్‌గా కరోనా సేవలో ఉన్న ఓ కళాశాలకు చెందిన విద్యార్థినిపై మనస్సు పడ్డాడు.
శ్రీమతి కమలకన్నన్..
ఆమెకు దగ్గరయ్యే దిశగా తన పరిధిలోని చిన్న చిన్న పనుల్ని అప్పగించడం మొదలెట్టాడు. తమ జాబితాలోని ఫోన్ నంబర్ ఆధారంగా ఆ యువతికి దగ్గరయ్యే దిశగా ప్రేమ పాఠాలు వళ్లించే పనిలో పడ్డాడు. టిక్ టాక్‌లో నిన్ను చూసిన క్షణాన....అంటూ మొదలెట్టి...ఆ యువతిని రోజు వేధించడం మొదలెట్టాడు. రెండేళ్ల క్రితం నిన్ను చూసి ఉంటే, ఈ పాటికి శ్రీమతి కమలకన్నన్ అయ్యే దానివి అని, ఆ అదృష్టం లేకుండా పోయిందని, అయినా, మరో చాన్స్ దేవుడు ఇచ్చినట్టుందంటూ ఆ యువతిని వలలో వేసుకునే పనిలో పడ్డాడు. అలాగే, ఏఈ ఉద్యోగం అంటే, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ర్యాంక్ తనది అని, తన జీతం నెలకు రూ. 78 వేలు అని, దీన్ని బట్టి చూస్తే, ఏ మేరకు సుఖంగా, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చో అంటూ ఆశలు రేకెత్తించే వ్యాఖ్యలు చేసినా, ఆ యువతి ఎక్కడా చిక్కలేదు. చివరకు వేధింపులు అన్నది రోజు రోజుకు పెరగడంతో విసిగి వేసారిన ఆ యువతి ఇతగాడ్ని రెడ్ హ్యాండడ్‌గా పట్టించేందుకు సిద్ధమైంది. విధుల్ని పక్కన పెట్టి కమల కన్నన్ ఫోన్లో సాగిస్తున్న లీలల్ని రికార్డు చేసి ఎస్ ప్లనేడ్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఆడిటో సామాజిక మాధ్యమాల్లో నూ వైరల్‌గా మారడంతో కరోనా విధుల్లో కమల కన్నన్ ప్రేమ పాఠాల లీల చర్చకు దారి తీసింది. రేయింబవళ్లు అనేక మంది అధికారులు కరోనా కట్టడిలో శ్రమిస్తుంటే, విధుల్ని పక్కన పెట్టి, సేవకు వచ్చిన యువతిని ముగ్గులో దించేందుకు కమల కన్నన్ సాగించిన లీల కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ వరకు వెళ్లింది. దీంతో కమలకన్నన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment