ఆకాష్, ఇందుజా (ఫైల్)
సాక్షి, చెన్నై: పెళ్లి చేసుకోవాలని ఎంతగానే ప్రాధేయ పడ్డా.. అయితే, నిరాకరిస్తూ, తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చ గొట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని పోలీసులకు ఇందుజా హత్య కేసులో నిందితుడు ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు బుధవారం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రేణుక, నివేదలను వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్‌లో పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఇందుజాను వేళచ్చేరికి చెందిన ప్రేమోన్మాది ఆకాష్ సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు ఆకాష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పాఠశాల స్థాయిలో పరిచయం, ప్రేమ, ఆ ఇంటికి అన్నీ తానై చేసిన సపర్యలను వివరించాడు. ఆ కుటుంబంలో తాను ఒక్కడిగా భావించి, ఇన్నాళ్లు సేవల్ని అందించానని, అయితే, హఠాత్తుగా తనను దూరం పెట్టడంతో మూడు నెలలుగా తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నాడు. ఈ కాలంలో ఎంతో ప్రాధేయ పడ్డానని, అయితే, ఇందుజా మనస్సును ఆమె తల్లి మార్చేసిందని, చివరకు ఇందుజ కూడా తనను అసహ్యించుకోవడంతో ఉన్మాదిగా మారినట్టు వివరించాడు. సోమవారం రాత్రి ఆ ఇంటికి పెట్రోల్ క్యాన్‌తో వెళ్లినా, హతమార్చాలన్న ఉద్దేశం తొలుత లేదని తెలిపాడు.
ఆంటీ రేణుక లోనికి అనుమతించలేదని, ఎంతో ప్రాధేయ పడ్డ అనంతరం ఇందుజాతో మాట్లాడే అవకాశం కల్పించా రని, అయితే, ఇందుజా తనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హెచ్చరికలు చేయడంతో ఇక, హతమార్చాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చి, పెట్రోల్ పోసి నిప్పంటించానని తానూ పోసుకునే క్రమంలో ఆమె తల్లి, చెల్లి బయటకు రావడంతో వారి మీద కూడా పోసినట్టు, ఇరుగు పొరుగు వారు అక్కడికి రావడంతో మోటార్ బైక్ మీద ఉడాయించానని వివరించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాని, కుటుంబానికి, మిత్రులకు మెసేజ్‌లు కూడా చేసి, చివరకు గస్తీ పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ గస్తీ పోలీసులు తనను అనుమానంతో పట్టుకున్నారని, తర్వాత తానే ఇందుజాను కడతేర్చినట్టు వారి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకుని ఉంటే బాగుండేదని, అయితే, పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నాడు. దీంతో అతడ్ని బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరిచినానంతరం పుళల్ జైలుకు తరలించారు.
ఆందోళనలు
ఈ ఘటనతో ఆదంబాక్కం పరిసర వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అక్కడి ప్రజలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ మురళి వారితో చర్చలు జరిపి హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు తగ్గ సెక్షన్లను నమోదు చేసినట్టు వివరించడంతో అక్కడి ప్రజలు వెనక్కు తగ్గారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ ఇద్దర్ని మెరుగైన చికిత్స నిమిత్తం కీల్పాకం నుంచి వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని పీఎంకే అధినేత రాందాసు డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, ఇటీవల కాలంగా వన్‌సైడ్ లవ్ వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని, ప్రేమోన్మాదుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం కాదని, మరొకరు ఇలాంటి తప్పు చేయని రీతిలో కఠినంగా శిక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment