యూకో బ్యాంకు మాజీ చైర్మన్ అరుణ్ కౌల్
న్యూఢిల్లీ : మరో బ్యాంకింగ్ మోసం శనివారం బయటపడింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రేవేటు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ ఎరా ఇంజనీరింగ్ ఇఫ్రా లిమిటెడ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ అల్‌టియస్ ఫిన్‌సర్వ్ ప్రైవేటు లిమిటెడ్‌లకు రుణాల చెల్లింపు విషయంలో అరుణ్ కౌల్ అవతవకలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
అరుణ్ కౌల్ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఇద్దరు వజ్రాల వ్యాపారులు బ్యాంకులకు సుమారు రెండు బిలియన్ డాలర్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెల్సిందే.
ఈ మోసం కేసు బ్యాంకింగ్ రంగాన్నే ఓ కుదుపు కుదుపేసింది. ఈ నెల1న యూకో బ్యాంక్ మాజీ మేనేజర్‌తో పాటు మరో నలుగురిపై రూ.19 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ మోసం వెలుగులోకి రావడంతో యూకో బ్యాంకు ఉద్యోగులు ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది. యూకో బ్యాంకు కేసుకు సంబంధించి అరుణ్ కౌల్‌తో పాటు కొంత మందిబ్యాంకు అధికారులు, రెండు ప్రైవేటు కంపెనీలకు చెందిన అకౌంటెంట్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
బ్యాంకు మంజూరు చేసిన రుణాలు దేనికి సంబంధించి మంజూరు చేశారో దానికి వినియోగించలేదని, చార్టడ్ అకౌంటంట్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రుణాలను అటువైపు మళ్లించి మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి రెండు కంపెనీలు, అకౌంటంట్లు, నిందితుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment