అయ్యో.. ఆమె | AP is the second place in the country with Human Trafficking | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఆమె

Published Fri, Mar 2 2018 4:53 AM | Last Updated on Wed, Aug 1 2018 2:20 PM

AP is the second place in the country with Human Trafficking - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా ఆందోళనకర స్థాయికి చేరింది. గుంటూరు, విజయవాడ ప్రధాన కేంద్రాలుగా ఈ దందా కొనసాగుతోంది. ప్రేమ పేరుతో వంచనకు గురై, పేదరికంతో బతుకు వెళ్లదీసే పరిస్థితి లేక, విలాసవంతమైన జీవనంపై మోజు... ఇలా పలు కారణాలతో అక్రమ రవాణా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గోవాలో పని చేస్తున్న సెక్స్‌ వర్కర్లలో 85 శాతం, ముంబైలో 38 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన వారేనని ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ నేర నమోదు సంస్థ (ఎస్‌సీఆర్‌బీ), ఎన్జీవోలు, రాష్ట్ర పోలీసుశాఖ రికార్డులు మహిళల అక్రమ రవాణాను తేటతెల్లం చేస్తున్నాయి. పలు జిల్లాల నుంచి ముంబై, గోవాలకు మహిళల అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. చట్టాలు, పోలీసు వ్యవస్థ ఈ దారుణానికి ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. మానవ అక్రమ రవాణా (హ్యుమన్‌ ట్రాఫికింగ్‌)పై కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకు కారకులైన ముఠా సభ్యులకు జీవిత ఖైదు విధించాలని తాజాగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘మానవ  అక్రమ రవాణా(నివారణ, పరిరక్షణ, పునరవాసం) బిల్లు–2018’కు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో అక్రమ రవాణాపై చర్చ జరుగుతోంది.

వేశ్యావాటికల్లో విధివంచితులు
రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి మహిళల అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరుతోపాటు తిరుపతి, విశాఖపట్నం నగరాలు అతివల తరలింపునకు అడ్డాలుగా మారిపోయాయి. ఇక్కడి నుంచి గోవా, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలోని వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘం ఇటీవల కృష్ణా, తూర్పు గోదావరి, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో అధ్యయనం చేసింది. హైదరాబాద్‌ తరహాలో గుంటూరు, విజయవాడ ప్రధాన కేంద్రాలుగా మహిళల అక్రమ రవాణా సాగుతున్నట్టు గుర్తించింది.

ఐరాస నివేదికలో రెండో స్థానం
మహిళల అక్రమ రవాణాపై ఐక్యరాజ్యసమితి, జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ), ప్రత్యేక సర్వే సంస్థల పరిశీలనలో బయటపడుతున్న నిజాలు కలవరపరుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కార్యాలయ నివేదిక ప్రకారం.. మహిళల అక్రమ రవాణాలో ప్రపంచంలోని 167 దేశాల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. దేశంలో రెండు కోట్ల మంది సెక్స్‌వర్కర్లు ఉండగా వారిలో 40 లక్షల మంది మాత్రమే స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి వచ్చారని, మిగిలిన 1.60 కోట్ల మందిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపినట్లు సర్వేలో తేలింది. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, బిహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి మహిళల అక్రమ రవాణా ఎక్కువగా సాగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. దేశంలో మహిళల అక్రమ రవాణాలో పశ్చిమబెంగాల్‌ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో స్పష్టం చేసింది. మానవ అక్రమ రవాణాలో 80 శాతం మంది మహిళలు ఉండగా, వారిలో ఏకంగా 60 శాతం మంది మైనర్లే కావడం గమనార్హం. వారిలో 40 శాతం మంది లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక–2016 ప్రకారం... భారత్‌లో మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో నిలిచింది.  

బాధితుల్లో బాలికలే ఎక్కువ
రాష్ట్రంలో 2016 కంటే 2017లో మహిళల కిడ్నాప్‌లు 17.98 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2016లో 665 మంది, 2017లో 700 మంది కిడ్నాప్‌నకు గురైనట్లు ఏపీ పోలీస్‌ వార్షిక నివేదిక బహిర్గతం చేసింది. కిడ్నాప్‌నకు గురైన వారిలో 12 నుంచి 18 ఏళ్లలోపు బాలికలే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2016లో 239 మంది, 2017లో 271 మంది మహిళలు అక్రమ తరలింపునకు(ట్రాఫికింగ్‌) గురైనట్లు పోలీసుశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య అంతకు పది రెట్లు ఎక్కువగా ఉంటుందనేది బహిరంగ రహస్యమే.

సర్కారు ఉదాసీనతే అక్రమార్కులకు వరం
చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ తరలింపు కేసుల్లో పట్టుబడిన వారంతా చిన్నపాటి శిక్షలు, బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ అదే దందా నిర్వహిస్తున్నారు. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ప్రత్యేక టీమ్‌ మరుగున పడింది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించి చేతులు దులుపుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement