
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ
నెల్లూరు(క్రైమ్): చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై దొంగలుగా మారారు. పది మంది ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి వేళల్లో నగరంలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిపై దాడిచేసి నగదు, సెల్‌ఫోన్లు దోపిడీ చేసి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు.
వీరి కదలికలపై నిఘా ఉంచిన రెండో నగర పోలీసులు సోమవారం నిందితులను తూర్పు రైల్వేక్వార్టర్ సమీపంలో అరెస్ట్ చేశారు. స్థానిక రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు.
బోగోలు మండలం చెంచులక్ష్మీపురానికి చెందిన రాకేష్, పొగతోటకు చెందిన నాగరాజు, కిసాన్‌నగర్, బాలాజీనగర్, బీవీనగర్, పొదలకూరురోడ్డు, కోటమిట్ట, సంతపేట, బోడిగాడితోట, ఎన్టీఆర్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన మరో ఎనిమిది మంది బాలలు చిన్నతనం నుంచే చెడు (మద్యం, వ్యభిచారం) వ్యసనాలకు బానిసయ్యారు.
అందరూ ముఠాగా ఏర్పడి తొలుత చిల్లర దొంగతనాలు చేశారు. వ్యసనాలకు డబ్బులు చాలకపోవడంతో రాత్రి వేళల్లో బైక్‌లపై తిరుగుతూ రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లకు వెళ్లే ప్రయాణికులు, ఇళ్లకు వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడి చేసేవారు.
వారి వద్ద నుంచి విలువైన సెల్‌ఫోన్లు, నగదు దోపిడీ చేసి విలాసంగా జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు అధికం కావడంతో రెండో నగర పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం నిందితులు తూర్పు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్నారన్న సమాచారం రెండో నగర ఇన్‌స్పెక్టర్ వెంకటరావుకు అందింది.
దీంతో ఆయన ఎస్సై వి. శ్రీహరి, క్రైం ఏఎస్సై రాజేశ్వరరావు, సిబ్బంది భాస్కర్, చెంచయ్య తదితరులతో కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు రెండు, ఆరో నగర పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
దీంతో రాకేష్, నాగరాజును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4 లక్షలు విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.6,200 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఎనిమిది మంది బాలలు కావడంతో వారిని జువైనల్çహోమ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment