సుమిత్ జింగ్రాన్ గౌరవ్‌వర్మ సచిన్ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ రెస్టారెంట్‌లలో విందుకు వెళుతున్న కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు ఇస్తున్న ఏటీఎం కార్డుల వివరాలను స్కిమ్మింగ్ ద్వారా సేకరించి క్లోనింగ్ కార్డులతో డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏటీఎం నుంచి రెండు విడతల్లో రూ.లక్ష డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ అందడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కిమ్మింగ్ మోసం వెలుగులోకివచ్చింది.
సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకిషర్మిలా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎంబీఏ మధ్యలోనే మానేసిన వారణాసికి చెందిన సుమిత్ జింగ్రాన్ ఓ కాల్‌సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశాడు. ఈ సమయంలో స్కిమ్మింగ్ కార్డుల మోసాలపై అవగాహన పెంచుకున్న అతను సులభంగా డబ్బులు సంపాదించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా స్కిమ్మర్లు, ఎంఎస్‌ఆర్ యంత్రాలను, మాగ్నటిక్ స్ట్రిప్‌లను కొనుగోలు చేశాడు. పలు రెస్టారెంట్‌లలో కస్టమర్లు బిల్లు చెల్లించేందుకు వెయిటర్లకు కార్డులను ఇవ్వడం గుర్తించిన అతను వెయిటర్లతో కుమ్మక్కైతే మోసాలు చేయడం తేలికనే నిర్ణయానికి వచ్చాడు. దీంతో పలు ప్రధాన నగరాల్లోని బార్‌లు, పబ్‌లు, రెస్టారెంట్‌లలో పనిచేసే వెయిటర్లను కలిసి స్కిమ్మింగ్ ద్వారా కార్డు వివరాలతో పాటు పిన్ నంబర్ సంపాదించి ఇస్తే ఒక్కో కార్డుకు రూ.రెండువేల చొప్పున ఇస్తానని ఎరవేశాడు. ఇందుకు అంగీకరించిన వెయిటర్లకు కార్డు వివరాలు, పిన్ నంబర్ సేకరించడంపై అవగాహన కల్పించేవాడు.
ఈ నేపథ్యంలో గోవాలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న తన స్నేహితులు రఫిక్ ఫరూక్ ఖాన్, సచిన్ కుమార్‌లను కలిసి తన పథకాన్ని వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రఫిక్, సచిన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో పనిలో చేరారు. వారు బిల్లు చెల్లించేందుకు కస్టమర్లు ఇచ్చిన ఏటీఎం కార్డులను స్కిమ్మింగ్ చేయడంతో పాటు పిన్ నంబర్లు తెలుసుకొని సుమిత్ జింగ్రాన్‌కు అందించేవారు. 15 రోజులకోసారి ఆయా రెస్టారెంట్‌లు, బార్‌లకు వెళ్లి వారి నుంచి వివరాలు తీసుకొని ఎంఎస్‌ఆర్ యంత్రాల సహాయంతో డాటాను క్లోన్ చేసి ముంబైకి చెందిన కెవిన్ జెర్రీ డిసౌజా, ఢిల్లీకి చెందిన గౌరవ్ వర్మలకు ఇచ్చేవాడు. వారు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేవారు. వచ్చిన మొత్తంలో 15 శాతం వారికి కమీషన్‌గా ఇచ్చేవాడు. ఇదే తరహాలో హైదరాబాద్ కస్టమర్ల నుంచి దాదాపు రూ.15 లక్షలు
డ్రా చేశారు.
ఇతర నగరాల్లో దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సురేంద్రకు బంజారాహిల్స్‌లోని ఓ ఏటీఎం నుంచి రెండు దఫాలుగా రూ. లక్ష డ్రా అయినట్లు సమాచారం అందడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో పంజాబ్ పాటియాలో జింగ్రాన్, గౌరవ్‌వర్మ, సచిన్ కుమార్‌లను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు. అయితే కెవిన్ జెర్రీ డిసౌజాను అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. రఫిక్ ఫరూక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. గతంలోనూ వీరిని థానే పోలీసులతో పాటు పంజాబ్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment