
సాక్షి, చిలకలూరిపేట : పెళ్లికి నిరాకరించిన మైనర్ బాలిక గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి సంబంధించి ఎస్‌ఐ కె.నాగేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సంజీవ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లితో కలిసి స్పిన్నింగ్ మిల్లులో కూలి పనులకు వెళుతోంది. ఇదిలావుంటే.. నరసరావుపేటకు చెందిన ఆమె బావ (అక్క భర్త)కు తమ్ముడైన అంకం అఖిల్‌కుమార్ కొంత కాలంగా బాలిక వెంటపడి.. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు.
బాలిక తల్లి తన కుమార్తెకు మైనార్టీ తీరకపోవడం, అఖిల్ కుమార్ సత్ప్రవర్తనతో ఉండకపోవడం వంటి కారణాల వల్ల అతడికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన అఖిల్ తనను పెళ్లి చేసుకోవాలని బాలికను బలవంత పెట్టాడు. బాలిక కుదరదనటంతో వెంట తెచ్చుకున్న షేవింగ్ బ్లేడ్‌తో బాలిక గొంతుపై కోసి తాను కూడా గొంతుపై గాయం చేసుకున్నాడు. బాలిక కేకలు వేయటంతో ఆమె తల్లి, చుట్టుపక్కల వారొచ్చి బాలికను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడు కూడా ఆదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment